Srinivasa Varma: ఢిల్లీలో కారు ప్రమాదం – కేంద్ర మంత్రి భూపతిరాజుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదంలో తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. బుధవారం లోక్‌సభ సమావేశానికి హాజరైన అనంతరం, మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా విజయ్ చౌక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంత్రి వర్మ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది.

ఘటనలో మంత్రికి కాలుకు గాయమైంది. వెంటనే సహాయక సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడంతో కొంతకాలం విశ్రాంతి అవసరమని సూచించారు. అయితే, ప్రమాదం జరిగినప్పటికీ మంత్రిగారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో భూపతిరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంత్రి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఏపీలోని నరసాపురం పార్లమెంట్ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, ఈ అనుకోని ఘటన వల్ల ఆయన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

ప్రస్తుతం మంత్రిగారు విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే ప్రజా కార్యక్రమాల్లో తిరిగి పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఢీకొట్టిన కారును నడిపిన డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply