హైదరాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో అప్ డేట్ ఇచ్చింది. ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీఎస్ పథకాన్ని ఉపయోగించుకుని నగరంలోని ఆస్తి పన్ను మొండి బకాయిలున్న వారు పన్ను చెల్లించాలని సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్‌లో మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10శాతం చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ఈసారి ఆస్తి పన్నుకు సంబంధించి రూ. 2 వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఓటీఎస్‌కు అంగీకరించడంతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవుతాయని జీహెచ్ఎంసీ భావిస్తోంది. కాగా, గత ఏడాది ప్రవేశపెట్టిన ఓటీఎస్ వల్ల సుమారు లక్ష మంది వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను బకాయిలు రూ. 4 వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ.1000 కోట్లు సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సి ఉంది. పెండింగ్ బకాయిలకు వడ్డీ కలిపితే రూ. 2,500 కోట్ల వరకు అవుతోంది. ఈ క్రమంలోనే ఓటీఎస్ ద్వారా వడ్డీని 90 శాతం తగ్గించి పన్ను బకాయిలను రాబట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.