చేపల పులుసు మాంసాహార ప్రియులకు రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇప్పుడు రాజకీయ వేదికగా మారిపోయింది. ప్రత్యర్థి నేతలపై వ్యాఖ్యలు చేసేందుకు, వారిని ఇరుకున పెట్టేందుకు నేతలు దీన్ని ఓ ఆయుధంగా మార్చేస్తున్నారు. తెలంగాణలో జల వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు చేపల పులుసు రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంది.
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం, కృష్ణా, గోదావరి నదుల నీటి పంపిణీ కొత్త సమస్యగా మారింది. రెండు రాష్ట్రాల సీఎంలను సభ్యులుగా ఉంచి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏపీక్స్ కమిటీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పేర్కొనబడింది. అయితే, ఇప్పటికీ నీటి వాటాలపై స్పష్టమైన అవగాహన లేకపోవడంతో వివాదం కొనసాగుతూనే ఉంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య నీటి ప్రాజెక్టుల విషయంలో మాటల యుద్ధం చెలరేగుతోంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత పది ఏళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సక్రమంగా పాలన నిర్వహించి ఉంటే, ఇప్పుడు ఈ కష్టాలు ఉండేవి కావు అన్నారు. దీనికి కౌంటర్‌గా హరీష్ రావు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ధీటుగా స్పందించారు.
పోతిరెడ్డిపాడుపై కేసీఆర్-జగన్ కలిసి గతంలో నాటకాలు ఆడారని సీఎం రేవంత్ విమర్శలు చేశారు. అలాగే, నగరిలో రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు, రాగి సంకటి తిన్న కేసీఆర్, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని చెప్పారా లేదా అని రేవంత్ ప్రశ్నించారు. దీనికి కౌంటర్‌గా హరీష్ రావు కూడా అదే విమర్శల బాణాన్ని సంధించారు. ఏపీ కృష్ణా నీటిని తరలించుకుంటుంటే, ప్రజాభవన్‌లో చంద్రబాబును ఆహ్వానించి గౌరవంగా పలకరించింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు. అంతేకాదు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిన్న సంగతి కూడా గుర్తు చేశారు.
రాజకీయ విమర్శలు ఏవైనా కొనసాగుతూనే ఉంటాయి. కానీ అసలు సమస్య తెలంగాణకు తగిన నీటి వాటా అందుతోందా అన్నదే. గత పాలకులు చేసిన తప్పులను ప్రస్తుత నేతలు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారా లేక ప్రజలకు మరింత గందరగోళాన్ని సృష్టించి, తమ రాజకీయ ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నిస్తున్నారా అనేదే అసలైన ప్రశ్న. ఈ చేపల పులుసు వివాదం ఎక్కడ దాకా వెళ్తుందో వేచి చూడాలి.