Diesel Vehicles: కేంద్రం ప్రభుత్వం వద్దకు కీలక నివేదిక

Diesel Vehicles

Diesel Vehicles: కేంద్రం ప్రభుత్వం వద్దకు కీలక నివేదిక

Diesel Vehicles: డీజిల్ వాహనాలను నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వం వద్దకు ఓ కీలక నివేదిక వచ్చింది. దేశంలోని 10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో, విపరీత కాలుష్యం కలిగిన  నగరాల్లో 2027 నాటికి డీజిల్‌ వాహనాలపై (Diesel Vehicles) పూర్తిగా నిషేధం విధించాలని ఆ నివేదికలో కోరారు.

పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన మార్గదర్శకాలను రూపొందించాలని ఈ కమిటీని ప్రభుత్వం కోరింది. తాజాగా కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు బహిర్గతం అయ్యాయి.   వాటి స్థానంలో విద్యుత్‌, గ్యాస్‌ ఆధారిత వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి తోడు ద్విచక్ర వాహనాల విషయంలోనూ డీజిల్, పెట్రోల్ వాహనాలను పూర్తిగా నిషేధించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఈ విషయాలను పేర్కొన్నారు.

Also Watch

Adipurush Official Trailer: ఒక రోజు ముందే ఈ ట్రైలర్ విడుదల

2024 నుంచి డీజిల్‌తో నడిచే సిటీ బస్సులను అనుమతించకూడదని ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. 2030లోగా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే సిటీ బస్సులుగా వినియోగించాలని తెలిపింది. అప్పటివరకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో వాహనాలను నడిపించాలని సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారేంత వరకు సీఎన్‌జీని ఆల్టర్నేటివ్ ఇంధనంగా ఉపయోగించాలని నివేదికలో పేర్కొంది. మరో 10 నుంచి 15 ఏళ్లలోగా సంప్రదాయ ఇంజిన్లతో నడిచే టూ వీలర్స్, త్రీ వీలర్స్‌ని సైతం రోడ్డుపైకి అనుమతించకూడదని చెప్పింది.  2035 నాటికి సంప్రదాయ ఇంజిన్లతో నడిచే బైక్‌లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాలను సైతం దశలవారీగా తప్పించాలి. వీటి స్థానంలో విద్యుత్‌ వాహనాలు ప్రోత్సహించాలి.

చమురు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ప్రభుత్వానికి ఫిబ్రవరిలోనే అందించినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే దేశాల్లో ప్రస్తుతం భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. చైనా, అమెరికా, ఈయూ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2030 నాటికి దేశాన్ని కర్బన ఉద్గార రహితంగా మార్చేందుకు భారత్ హామీ ఇచ్చింది. ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. 2030 నాటికి దేశంలో వినియోగించే మొత్తం ఇందనంలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ఉండేలా భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2070 నాటికి ‘నెట్‌ జీరో’ సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply