తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ తొలి రోజు సమావేశంలో తన ప్రసంగంలో గవర్నర్ అన్ని అబద్దాలు, అర్థ సత్యాలే మాట్లాడారని అన్నారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం కూడా రుణమాఫీ జరగలేదు కానీ.. రుణమాఫీ మొత్తం జరిగిందని గవర్నర్ తో ప్రభుత్వంలోని పెద్దలు అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో రైతుబంధు మొత్తం అందిందని అసత్యాలు చెప్పించారని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు ఊరటనిచ్చేలా ఏ ఒక్క మాట కూడా లేదన్నారు. గురుకులాల్లో అధ్వాన్న పరిస్థితులపై కూడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్ పై గుడ్డి కోపంతో మేడిగడ్డ మరమ్మతులు చేయలేదని కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. అటు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గవర్నర్ ప్రసంగం తరువాత వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించిందని అన్నారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రసంగంలో వెల్లడించారు. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో సభను ఎన్ని రోజులు నడిపించాలో నిర్ణయిస్తారు. మార్చి19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ సమావేశాలు ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ఉభయసభల్లో వేరు వేరుగా చర్చించి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేస్తారు. ఈనెల 17, 18 తేదీల్లో బీసీలకు విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ తీర్మానం చేయనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు హాజరైన మాజీ సీయం కేసీఆర్ ఈ సమావేశాల చివరి వరకు అసెంబ్లీకి వస్తారా.. అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇది గవర్నర్ ప్రసంగం కాదు గాంధీ భవన్ ప్రసంగం: కేటీఆర్
420 హామీల గురించి చెహుతారేమో అనుకున్నాం
గవర్నర్ తో అబద్ధాలు చెప్పించడం బాధాకరం
రైతులకు భరోసా ఇచ్చే ఒక్క మాట చెప్పలేదు
రాష్ట్రంలో ఏ గ్రామంలో 25 నుండి 30 శాతం వరకు రైతు రుణమాఫి జరగలేదు
రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే… pic.twitter.com/DqKqB1AwGo
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2025
courtesy: https://www.bigtvlive.com/