అమిత్ షాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ..

అమిత్ షాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ, కీలక బాధ్యతలు అప్పచే ప్పానున్న  డిల్లీ పెద్దలు

భారతీయ జనతా పార్టీలో చేరిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి వరుసగా ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు.  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన శుక్రవారం సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. శనివారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. దాదాపుగా  40 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపైనాచర్చించారు.  మరో సీనియర్ నేత బీఎల్ సంతోష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదే సమయంలో జేపీ నడ్డా, అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సమావేశమై కర్ణాటక ఎన్నికలపై చర్చలు జరిపారు. వీరితో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కిరణ్ కుమార్‌రెడ్డికి పలు కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డి చేరిక కోసం ఢిల్లీ వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఏపీ బీజేపీ నేతలు లేరు. సోము వీర్రాజు సహా కీలక నేతలంతా ఏపీలోనే ఉన్నారు. అయితే వారెవరూ కిరణ్ రెడ్డి చేరికపై వ్యతిరేకత వ్యక్తం  చేయడంలేదు. అందరూ స్వాగతించారు. కలిసి పని చేస్తామన్నారు. అలాంటప్పుడు బీజేపీ నేతలంతా కిరణ్ రెడ్డి చేరిక కార్యక్రమలో పాల్గొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ రాజకీయాల కోణంలోనే హైకమాండ్ చేర్చుకుందని అందుకే చేరిక విషయంలో రాష్ట్ర నేతలతో పెద్దగా సంప్రదింపులు జరపలేదని సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు.

మరో వైపు ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లోకి కిరణ్ కుమార్ రెడ్డిని పంపకపోచ్చని ఆయనను పార్టీలో చేర్చుకున్న వ్యూహం జాతీయ రాజకీయాలని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఆయనకో పదవి ఇస్తుందని  జాతీయంగా పార్టీ కోసం పని చేస్తారని రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం  చేసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పని చేసినందున తెలంగాణలో రాజకీయాలపైనా ఆయనకు అవగాహన ఉంటుంది. సమైక్యాంధ్ర పార్టీ పెట్టినందన ఆయన జోక్యం నేరుగా తెలంగాణలో ఉండకపోవచ్చు కానీ ఢిల్లీలో ఉంటూ తెలంగాణ పై రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో కిరణ్ రెడ్డి వ్యూహాత్మకంగా పని చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా బెంగళూరు కేంద్రంగా తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి సేవలు వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో పర్యటనను ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. అప్పుడే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయనుంది. ఈ బోర్డు సమావేశానికి ముందే పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాటి భేటీలో చర్చించిన అంశాలను తిరిగి బోర్డులో కూడా చర్చించిన తర్వాత బీజేపీ పెద్దలు ఆమోదముద్ర వేయనున్నారు.

అయితే, బీజేపీలో చేరిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తారని జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశమైంది. కర్ణాటక ఎన్నికల తర్వత కిరణ్ కుమార్ రెడ్డి సేవలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డిని కాషాయ దళంలో చేర్చుకుంది. 64 ఏళ్ల కిరణ్ కుమార్ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కి చివరి ముఖ్యమంత్రి. మరోవైపు, చాలా కాలం పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్న తాను పార్టీని వదులుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని కిరణ్‌ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh