Talasani Srinivas yadav: బల్కంపేట ఎల్లమ్మకు 2.20 కిలోల బంగారు కిరీటం
Talasani Srinivas yadav: జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లమ్మ తల్లికి బంగారు కిరీటం సమర్పించనున్నామని తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తామన్నారు. హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను మంత్రి తలసాని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయాన్ని మహా పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఆలయ అభివఅద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు. చిరు వ్యాపారులకు షాపులను ఉచితంగా కేటాయించామని వెల్లడించారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మే 10న అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. కుల మత, రాజకీయాలకు అతీతంగా.. ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధిలో అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న బంగారంతో అమ్మవారికి ఆభరణాలు చేయిస్తున్నామని తెలిపారు. ఇలా 2.20 కిలోల బంగారంతో కిరీటం, ఇతర ఆభరణాలు తయారయ్యాయని మంత్రి తలసాని తెలిపారు.
కల్యాణోత్సవం సందర్భంగా అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకల వసతులు కల్పిస్తామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. బల్కంపేట ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేసినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దేవాలయానికి సంబంధించి షాపులను తీసుకున్న వారు సకాలంలో అద్దె చెల్లించే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అధికారులు, నూతన పాలక మండలి సభ్యులు సమన్వయంతో వ్యవహరించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మిబాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి దాదాపు 700 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా, కదలకపోవడంతో ఊళ్లోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయీ వేసినా కదలలేదు. ఇప్పటికీ విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు.