IPL 2023 CSK:చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు భారీ షాక్
IPL 2023 CSK: చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చిక్కుల్లో పడింది. ఆ జట్టుపై కోర్టులో కేసు నమోదైంది. ఆ ఆరోపణలు నిజమైతే సీఎస్కే మేనేజ్‌మెంట్ కు తిప్పలు తప్పవు.
అయితే ఇది వాళ్లకు ఆటకు సంబంధించిన విషయం కాదు.
చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ లాయర్ ఈ కేసు దాఖలు చేశారు.
చెన్నైకి చెందిన అశోక్ చక్రవర్తి అనే లాయర్ చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై చెన్నై సివిల్ కోర్టులో బుధవారం పిటిషన్ వేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ మ్యాచ్ లలో టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.
Also Watch
“ఇవాళ నేను చెన్నై సూపర్ కింగ్స్, బీసీసీఐ, టీఎన్‌సీఏలపై కేసు వేశాను. టికెట్ల అమ్మకాలలో అక్రమాలు, బ్లాక్ మార్కెట్, ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయి” అని అశోక్ చక్రవర్తి అనే ఆ లాయర్ తన ఫేస్‌బుక్ పోస్టులో అన్నారు.
నిజానికి టికెట్ల అమ్మకాల విషయంలో అభిమానులు కూడా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ పై ఆరోపణలు గుప్పించారు.
చెపాక్ స్టేడియంలో లోయర్ స్టాండ్ టికెట్ల రేట్లు రూ.1500 నుంచి రూ.2000 వరకూ ఉన్నా వాటిని రూ.8 వేల వరకూ అమ్ముకున్నారని ఆరోపించారు.
అయితే ధోనికి ఈ సీజన్ చివరిదనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అతడి ఆట చూసేందుకు అభిమానులు ఎంత ధరకైనా టికెట్లు కొనేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే వచ్చే వారం చెన్నైలో జరగబోయే ప్లేఆఫ్స్ మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకాలను కూడా తాత్కాలికంగా నిలిపేయాలని కూడా సదరు అడ్వొకేట్ పిటిషన్ లో కోరారు.
ఇంతవరకూ జరిగిన ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల రికార్డును కూడా కోర్టు ముందు ఉంచాలని అడిగారు.
ప్లేఆఫ్స్ లో భాగంగా చెపాక్ స్టేడియంలో తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది.
అయితే టికెట్ల అమ్మకాల్లో అక్రమాల ఆరోపణలపై ఇంతకుముందే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు.
తమకు అందుబాటులో ఉన్న 36 వేల టికెట్లలో 20 శాతం టికెట్లను బీసీసీఐకి, మరో 13 వేల టికెట్లకు టీఎన్‌సీఏ డివిజన్ క్లబ్ లకు ఇవ్వాల్సి ఉంటుందని, మిగతా టికెట్లనే అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.