అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Avinash Reddy: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదావేసింది. గురవారం మధ్యాహ్నం 3.30కి విచారిస్తామని న్యాయమూర్తి చెప్పారు. Avinash Reddy ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ రోజు అసలు లిస్టే కాలేదు. పదిన్నరకు అవినాష్ కేసు విషయాన్ని ఆయన తరఫున వాదించే న్యాయవాది ప్రస్తావించారు. విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు. జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టబోమని హైకోర్టు తెలిపింది. గురువారం విచారణ చేపట్టాలని అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది రిక్వస్ట్ చేశారు. అదే టైంలో శుక్రవారం వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని సునీత తరఫు న్యాయవాది కోరారు. కోర్టు మాత్రం గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు విచారణ చేపడతామని ప్రకటించింది.
ముందుగా ఈ కేసు విచారణ మంగళవారం ఉదయం ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని Avinash Reddyతరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత మధ్యాహ్నం మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు బుధవారం వింటామని న్యాయమూర్తి .. కేసును వాయిదా వేశారు. ఇవాళ ఉదయం మరోసారి విచారణకు వచ్చింది. దీన్ని గురువారానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మలుపులు తిరుగుతోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖరరెడ్డిలను సీబీఐ విచారణకు పిలిచింది. వివేకా హత్య వ్యవహారంలో అల్లుడు, బామ్మర్ది పాత్రలపై అవినాష్ రెడ్డి పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సిబిఐ వారిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
సునీత దంపతులను దాదాపు మూడు గంటలపాటు సీబీఐ బృందం విచారించింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సాయంత్రం 4 గంటల సమయంలో వచ్చిన దంపతులు సాయంత్రం 6.50 గంటలకు కార్యాలయం నుంచి తిరిగి వెళ్లారు. ఈ నెల 22న సీబీఐ విచారణకు హాజరైన రాజశేఖరరెడ్డిని విచారించిన అధికారులు.. మరోసారి రావాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారని సమాచారం. ఈ మేరకు మంగళవారం భార్యతో కలిసి వచ్చిన రాజశేఖర్ రెడ్డిని మరోసారి సీబీఐ అధికారులు విచారించారు.