బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం కారణంగా భారీగా ఆస్తి,ప్రాణనష్టo

బెంగళూరులో  గత కొన్ని రోజులుగా ఆకస్మిక వర్షాలు ముంచెత్తుతున్నాయి. బెంగళూరులో రుతుపవనాలకు ముందు వర్షాలు వినాశనం కలిగిస్తూనే ఉన్నాయి, బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. బెంగళూరు విధానసౌధ, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.

ఈ వరదల కారణంగా మల్లీశ్వర్‌ ప్రాంతంలోని ఓ నగల దుకాణం పెద్దమొత్తంలో నష్టపోయింది. ఆ ప్రాంతంలోని తొమ్మిదవ క్రాస్‌లో ఉన్న నిహాన్‌ జ్యువెల్లరీ అనే నగల దుకాణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో షాపులో ఉన్న రూ.కోట్ల విలువైన బంగారు నగలు వరదలో కొట్టుకుపోయినట్లు దుకాణం యజమాని ప్రియ తెలిపారు. దుకాణం సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనులే ఈ వరదలకు కారణమని ఆరోపించారు.

‘షాపులోని బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయి. మున్సిపల్‌ అధికారులకు ఫోన్‌చేసి సాయం కోరినా వారు స్పందించలేదు. దుకాణంలోని 80 శాతం నగలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుంది’ అని దుకాణం యజమాని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏప్రిల్ నుంచి జూన్ వరకు ముందస్తు రుతుపవనాలు ఉంటాయి. ఈసారి రుతుపవనాలకు ముందు వర్షాలు సాధారణం కంటే 10 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోగా, 331 పశువుల నష్టం, 20,000 హెక్టార్లలో పంట నష్టం, 814 ఇళ్లు దెబ్బతిన్నాయని సమావేశం అనంతరం సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించామని, పశువుల నష్టానికి ఉపశమనం కల్పించాలని, ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

 

 

Leave a Reply