తెలంగాణరాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్

Electricity Demand: తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే గురువారం అత్యధికంగా విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతగా విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. lఈరోజు ఉదయం 11.01 నిమిషాలకు అత్యధికంగా 15,497 మెగావాట్ల విద్యుత్ నమోదైందని వెల్లడించారు. మార్చి నెల ప్రారంభం నుంచే 15,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదవుతూ వస్తోందని అధికారులు తెలిపారు. విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పంటలకు వినియోగించే నీటి స్థాయి పెరిగిందని, ఉద్యాన పంటలకు కూడా నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎక్కువగా బోరుబావులపై ఆధారపడే వ్యవసాయ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

అలాగే ఒక వైపు వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడం, వ్యవసాయ రంగానికి విద్యుత్ వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజు రోజుకీ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. సాగు విస్తీర్ణం కూడా పెరగడం, మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు వినియోగం అధికమవుతుండటంతో అత్యధిక డిమాండ్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు వ్యవసాయానికి 35 శాతం మాత్రమే విద్యుత్ వినియోగించేవారని.. కానీ, ఇప్పుడు అది 37 శాతానికి పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగాక, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం 6666 మెగావాట్లు మాత్రమే ఉండేదని తెలిపారు. రానున్నది వేసవి కాలం కావడంతో విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని.

అయితే విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు మాట్లాడుతూఈ ఏడాది వేసవి కాలంలో 16వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందన్నారు. మార్చి నెలలోనే 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతుందని ముందూ ఊహించామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి, ప్రజలు, అన్ని రంగాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.

Leave a Reply