కరోనా వైరస్ (COVID-19) ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వైరస్‌ను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషించాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ సోకినా దాని తీవ్రత తగ్గి, ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్‌లపై కొత్త ఆరోపణలు వెలువడుతున్నాయి.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ అమితవ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ ప్రభావం వల్ల దేశంలో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు, పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలతో యువత, పెద్దలు మరణించడం ఆందోళన కలిగించే అంశమన్నారు.
పూర్తిస్థాయి ప్రయోగాలు పూర్తి చేయకుండానే వ్యాక్సిన్ ఇవ్వడం వల్లే దుష్ప్రభావాలు పెరిగాయని
గుండెపోటు, థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపెనియా, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని
వ్యాక్సిన్ తీసుకోని ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి ఆకస్మిక మరణాలు కనిపించడం లేదని వెల్లడించారు.
అంతేకాకుండా, కరోనా మహమ్మారి పేరుతో ఫార్మా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కరోనా సమయంలో జరిగిన మరణాల కంటే ప్రస్తుతం హఠాత్తుగా సంభవిస్తున్న మరణాలు రెట్టింపయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మరణాల వెనుక వ్యాక్సిన్ ఒప్పందాల రహస్యాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వాలు దర్యాప్తు చేయట్లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కర్ణాటక తరహాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆకస్మిక మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాయో చూడాలి.