Manipur Violence: మణిపూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న తెలుగు విద్యార్ధులు
Manipur Violence: మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులను తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు సోమవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 214 మంది తెలుగు విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1.22 గంటలకు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వీరిలో 106 మంది విద్యార్థులు తెలంగాణకు చెందినవారు కాగా, మిగిలిన 108 మంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.
మణిపూర్‌లోని ఇంఫాల్ వర్సిటీ తోపాటు వేర్వేరు విద్యాసంస్థల్లో చదుకుంటున్న 103 మంది తెలంగాణ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా ఇక్కడికి తీసుకురావటానికి తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను పంపాయి. మిగిలిన విద్యార్థులను కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తీసుకు రానున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటానికి ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చెందిన ఇద్దరు అధికారులను కోల్‌కతా పంపించినట్టు చెప్పారు. కోల్‌కతా నుంచి వచ్చే వారి కోసం టిక్కెట్లు బుక్ చేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, అధికారులు విమానాశ్రయంలో విద్యార్థులకు స్వాగతం పలికారు.
Also Watch
విద్యార్థులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుగా అధికారులు ఆహారం, రవాణా కూడా ఏర్పాటు చేశారు. మణిపూర్ నుంచి క్షేమంగా తిరిగి రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తమ విద్యా సంస్థల చుట్టూ జరుగుతున్న హింస కారణంగా తమ భద్రత గురించి తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు. తాము ఉన్న ప్రాంతంలో దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని. ఈ క్రమంలో తమకు ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ హాస్టళ్లలో ధైర్యంగా ఉన్నామని విద్యార్థులు తెలిపారు. ఐదు రోజులుగా ఇంటర్నెట్ పూర్తిగా పనిచేయలేదని.. కనీసం ఆహారం కూడా లభించలేదని.. పస్తులున్నామంటూ విద్యార్థులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిపారు.
అయితే మణిపూర్ అల్లర్లలో 50 మందికి పైగా చనిపోయారు. దాంతో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవటంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.