Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికలలో 16 ఓట్లతో గెలుపు తారుమారు
Karnataka Election Results 2023: కర్ణాటక రాజధాని బెంగళూరులోని జయనగర్ నియోజకవర్గం ఫలితం రాత్రి వరకు తేలలేదు.
కాంగ్రెస్ అభ్యర్థిని సౌమ్యా రెడ్డి తొలి నుంచి బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తిపై ఆధిక్యంలో నిలిచారు. అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తైన తర్వాత రామమూర్తిపై సౌమ్యా రెడ్డి 294 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
దీంతో ఆమె గెలిచినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అంతలోనే బీజేపీ నాయకులు పట్టుబట్టి రీకౌంటింగ్ చేయించారు.
ఇందులో బీజేపీ అభ్యర్థి సీకే.రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు అధికారులు తెలిపారు. దీంతో కౌంటింగ్ క్షణాల్లో పరిస్థితి మారిపోయింది.
అయితే ప్రతి రౌండ్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే సౌమ్యారెడ్డి 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ప్రకటించగానే ఆమెతో పాటు కార్యకర్తల సంతోషానికి హద్దుల్లేవు.
కానీ ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్ చేయాలని బీజేపీ అభ్యర్థి రామూర్తి డిమాండ్ చేయడంతో మళ్లీ రీకౌంటింగ్ ప్రారంభించారు.
Also Watch
అయితే చివరకు కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డిపై బీజేపీ అభ్యర్థి రామమూర్తి కేవలం 16 ఓట్లతో గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. సౌమ్యా రెడ్డికి 57,781 ఓట్లు రాగా, రామమూర్తికి 57,797 ఓట్లు వచ్చినట్లు పేర్కొంది.
కాగా, శనివారం రాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ హైడ్రామాపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థికి ఈసీ సహకరించిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు.
తమ అభ్యర్థి ఫలితాన్ని ఈసీ అధికారులు తారుమారు చేశారని విమర్శించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో పోలీసులను భారీ స్థాయిలో మోహరించారు.
అయితే వరుసగా మూడుసార్లు రీకౌంటింగ్ చేశారు. ఈ సమయంలో ఓట్ల లెక్కింపు సమయంలో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే.
శివకుమార్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి, ఎంపీ డీకే.సురేశ్, కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్,
ఇక బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎంపీ తేజస్విసూర్య మకాం పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.