JAGAN: కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?
JAGAN జీవితం వడ్డించిన విస్తరి. సమస్యలు ఉండే చాన్స్ లేదు. జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకొని రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రికి సమస్యలు ఉండటానికి వీల్లేదు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం ఎలా? అన్న దిగులు కూడా ఆయనకు లేదు.
చేస్తున్న అప్పులు ఎలా తీర్చాలా? అన్న చింత అసలే లేదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ధ్యాసే ఉండదు. న్యాయస్థానాలు తప్పుబడుతున్నా లెక్క ఉండదు. రాష్ట్రం ఏమైపోయినా బటన్లు నొక్కుతూ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకోగలిగితే చాలు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇతరత్రా సమస్యలు ఉండటానికి అవకాశం లేదు.
రాష్ర్టానికి రాజధాని లేదన్న బాధ లేదు. ఎవరు ఏమైపోయినా తనకు ప్రతి నెలా వివిధ మార్గాలలో రావాల్సిన సొమ్ము వచ్చిపడుతున్నందున ఆ డబ్బును లెక్కపెట్టుకుంటూ హాయిగా గడిపేయవచ్చు. అయినా జగన్‌కు జుట్టు ఎందుకు రాలిపోతున్నదో తెలియదు.
అయితే ముఖ్యమంత్రి JAGAN రెడ్డి ఆలోచనలు, వ్యూహాలు సగటు రాజకీయ నాయకుడికి భిన్నంగా ఉంటాయి. ఆయన తీసుకొనే నిర్ణయాల వెనుక ఉన్న అంతరార్థం అంత తేలికగా అంతుపట్టదు. ఈ క్రమంలో తన బుర్రను మథించడం వల్ల ఆయనకు జుట్టు రాలుతున్నదేమో తెలియదు.
దుష్ట తలంపులు, దుష్ట పన్నాగాలకు తెర లేపాలంటే కూడా తెలివితేటలు కావాలి. ఈ తరహా తెలివితేటలు జగన్‌కు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది.
మామూలుగా ఆలోచించే వారికి, చూసేవారికి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని అనిపిస్తుంది. అయితే రాజకీయ పరమార్థం లేకుండా జగన్‌రెడ్డి ఏ నిర్ణయమూ తీసుకోరు. ఇది కూడా ఆ బాపతే కావొచ్చు.
అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధానికి భూములిచ్చిన రైతులు చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నందున ఆ యాత్ర నుంచి దృష్టి మళ్లించడం కోసం ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన ఉన్నప్పటికీ అంతకంటే లోతైన ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఎన్టీఆర్ పేరును తొలగించడం వల్ల వైసీపీకి నష్టం కలుగుతుందని, ఈ నిర్ణయాన్ని ఆ పార్టీలో కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంత అమాయకంగా సొంత పార్టీకి నష్టం చేస్తారని భావించలేం.
తన సొంత సోషల్ మీడియా సైన్యాన్ని ముందుగానే సిద్ధం చేసుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సభలో బిల్లు పెట్టారు. దీంతో జగన్ నిర్ణయాన్ని సమర్థించే పోస్టులు, చంద్రబాబును దెప్పిపొడిచే పోస్టుల్ని జనం మీదకు వెంటనే వదిలారు. నిజానికి తండ్రి రాజశేఖర రెడ్డిపై జగన్‌కు అంతులేని ప్రేమ ఉందనుకోవడానికి కూడా లేదు.
రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తండ్రి పేరును సందర్భాన్ని బట్టి ఆయన వాడుకుంటున్నారు. అయినా మరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు? జగన్‌రెడ్డి సొంత సోదరి షర్మిల కూడా ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని తప్పుబట్టారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం ద్వారా కోట్ల మందిని అవమానించినట్టేనని ఆమె వ్యాఖ్యానించారు.
రేపు మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పేరును తొలగించవచ్చునన్న విషయం JAGAN కి తెలియంది కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌ను రాజకీయాల్లో మరెవరితోనూ పోల్చలేము.
ఇందిరాగాంధీ వంటి బలమైన నాయకురాలినే ఎదిరించి నిలబడ్డ మహానేత ఎన్టీఆర్. అధికారంలో ఉన్నంతకాలం నిప్పులా బతికిన ఎన్టీఆర్‌తో ఇతరులను పోల్చడం దుస్సాహసమే అవుతుంది. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇవ్వడమే కాకుండా పాలనాపరంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్‌కు మరెవరూ సాటిరారని ఆయనతో విభేదించే వారికి కూడా తెలుసు.
జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియవనుకోవడానికి లేదు. అయితే కుట్రలు, కుతంత్రాలు, కపటత్వానికి మారుపేరుగా సాగుతూ వచ్చిన పులివెందుల మార్కు రాజకీయంలో భాగంగానే ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి ఉంటారు.
1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చెయ్యని ప్రయత్నం లేదు. నాదెండ్ల భాస్కరరావు సహకారంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేసినా ప్రజాగ్రహానికి తలవొంచక తప్పలేదు. అప్పటి నుంచి ఎన్టీఆర్ పాలన సజావుగా సాగకుండా అనేక చికాకులు సృష్టించారు.
రాజ్‌భవన్ కేంద్రంగా అప్పటి గవర్నర్ కుమారి కుముద్‌బెన్ జోషీ కుట్రలు, కుతంత్రాలకు అవకాశం కల్పించారు. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా కొన్ని తప్పులు చేశారు. అయితే వాటివల్ల ప్రజలకు నేరుగా కలిగిన నష్టం గానీ, కష్టం గానీ ఏమీ లేవు. దీంతో కాంగ్రెస్ నాయకులు అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు.
వంగవీటి రంగా హత్యతో ఆ అవకాశం రానే వచ్చింది. నేర చరిత్ర కలిగిన రెండు కుటుంబాల మధ్య చోటుచేసుకుంటూ వచ్చిన హత్యల పరంపరలో భాగంగానే రంగా హత్య జరిగినప్పటికీ దానికి కులం రంగు పూశారు.
ఈ వ్యూహ రచనలో వైఎస్ రాజశేఖర రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఫలితంగా కమ్మ–కాపు సామాజిక వర్గాలు బద్ధశత్రువులుగా విడిపోయి కత్తులు దూసుకోవడం మొదలెట్టాయి. విచిత్రమేమిటంటే రంగా హత్యతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న దేవినేని నెహ్రూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేశారు.
ప్రస్తుతం దేవినేని తనయుడు అవినాష్ వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నారు. మొత్తానికి నాటి కేంద్ర మంత్రి పి.శివశంకర్, రాజశేఖర రెడ్డి వంటి వారు పన్నిన పన్నాగంలో ఎన్టీఆర్ చిక్కుకున్నారు. అందరూ ఆయనను కుల కోణంలో చూసేట్టు చేసే పన్నాగమిది.
ఫలితంగా 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓడిపోయారు. అయితే నాడు రగిలించిన కులాల కుంపట్లు ఇప్పటికీ రాజుకుంటూనే ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కులాల కుంపట్లను మరింతగా రాజేశారు.
కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఇతర కులాల్లో ద్వేష భావాన్ని ప్రేరేపించారు. ఈ వ్యూహం ఫలించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బకొట్టాలని అనుకున్నప్పుడల్లా కులం కార్డును తెరపైకి తేవడమే పులివెందుల మార్కు రాజకీయం.
పులివెందుల నియోజకవర్గానికి 1955 నుంచి రెడ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది కూడా నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబమే! అయినా బీసీలు పోటీ చేయాల్సిన కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం ఏమిటని కుప్పంలో బీసీలను రెచ్చగొట్టడానికి శుక్రవారం బీజం వేశారు.
ఎన్టీఆర్ పేరు తొలగింపుతో ఈ కులాల కుంపట్లకు సంబంధం ఏమిటా అని చాలా మంది భావించవచ్చు. నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం లేకుండా జగన్ ఏ నిర్ణయమూ తీసుకోరు. ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేయడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు తీవ్రంగా స్పందిస్తారని జగన్మోహన్ రెడ్డికి తెలుసు.
ఆయన కోరుకున్నది కూడా ఇదే. దీంతో ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాలను మళ్లీ సంఘటితం చేయవచ్చునన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి ఎన్టీఆర్ ముందు జగన్ వంటి వారు మరుగుజ్జులు. అయినా తన రాజకీయం కోసం ఎన్టీఆర్‌ను సైతం వాడుకోగల తెంపరితనం జగన్ సొంతం.
ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో గౌరవమని ముఖ్యమంత్రి చెబుతున్నారు గానీ, ఆయనకు ఎవరిపైనా గౌరవం ఉండదు. రాజకీయాల కోసం కులాలను వాడుకొని ప్రయోజనం పొందడం ఎలా అన్నది జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ కారణంగానే షర్మిలకు తప్పుగా కనిపించిన నిర్ణయం జగన్‌కు సక్రమంగా కనిపించింది.
ఈ దెబ్బతో ఎన్టీఆర్ వంటి మహా నాయకుడిని కూడా ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నమే జగన్ నిర్ణయ పరమార్థం. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న మహనీయుడు ఎన్టీఆర్.
మామూలుగా అయితే బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా అలాంటి యుగపురుషుడిగా కీర్తి పొందిన ఎన్టీఆర్ పేరు తొలగించరు. జగన్ మాత్రమే ఆ పని చేయగలిగారంటే అది ఆయన నైజం. తెల్లారి లేచిన దగ్గర నుంచి కుళ్లు, కుతంత్రాలు, కపటత్వంతోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.
అడుగడుగునా ప్రజలను వంచిస్తుంటారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న దానికీ పొంతన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. కుట్రలు, కుయుక్తులకు పాల్పడే వారికే తెలివితేటలు ఎక్కువగా కావాలి.
జగన్‌రెడ్డికి ఈ తెలివితేటలు ఎక్కువ. అందుకే ఆయన నిర్ణయాలు విచిత్రంగా ఉంటాయి. అంతు పట్టకుండా ఉంటాయి. నిజానికి ఎన్టీఆర్ పేరునే కొనసాగించినా, తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టినా చూసి మురిసిపోవడానికి ఆ ఇరువురు నాయకులూ ఇప్పుడు మన మధ్య లేరు.
ఎప్పుడో చనిపోయిన వారి పేర్లతో రాజకీయం చేయడంలోనే కిటుకంతా ఉంది. వైఎస్ఆర్ వైద్యుడు కనుక వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టామని మంత్రి విడదల రజని చెప్పుకోవడం పుండు మీద కారం రాసినట్టుగా ఉంది.
దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన అనేక మంది నాయకుల పేర్లను వారిపై గౌరవంతో వివిధ ప్రాజెక్టులకు, భవనాలకు మనం పెట్టుకుంటూ వచ్చాం. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ న్యాయవాది మాత్రమే. అయినా సాంకేతిక విశ్వవిద్యాలయాలకు ఆయన పేరు పెట్టుకున్నాం.
నాయకులపై గౌరవంతో పేర్లు పెట్టుకొనే దశ నుంచి కుల ప్రాతిపదికన పేర్లు పెట్టుకొనే దుస్థితికి దిగజారాం. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కనిపిస్తాయి. కానీ వాటివల్ల ఆయనకు నష్టం జరగకపోగా దీర్ఘకాలంలో సమాజానికి మాత్రమే కీడు చేసే విధంగా అవి ఉంటాయి.
ఎన్టీఆర్ పేరు తొలగింపు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య జగడం మొదలైంది. ఇటువంటి పరిస్థితినే జగన్ కోరుకుంటున్నారు. అందుకే ఆయన జుట్టు రాలిపోతున్నా పట్టించుకోకుండా కపటత్వంతో కూడుకున్న నిర్ణయాలను ఆలోచించి మరీ తీసుకుంటున్నారు.
బటన్లు నొక్కడానికి మాత్రమే జిల్లాల పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తన హయాంలో పురుడు పోసుకుని ప్రారంభోత్సవాలకు సిద్ధమైన ఒక ప్రాజెక్టు గురించి గానీ, ఒక పరిశ్రమ గురించి గానీ చెప్పగలరా? ఆయనకు ఆ అవసరం లేదు కనుక ఎన్టీఆర్ వంటి మహనీయులను కూడా వివాదాల్లోకి లాగుతుంటారు.
కురచ బుద్ధులు మాత్రమే కలిగివున్న పాలకులను ఎన్నుకున్నప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రస్తుతానికి ఆయన జుట్టు ఊడిపోతుండవచ్చు. నేటి నిర్ణయాల పర్యవసానాలు అనుభవంలోకి వచ్చాక చేయగలిగిందేమీ లేక జనం కూడా జుట్టు పీక్కుంటారు.తప్పదు.
అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగు నింపడమే తన జీవితాశయం అని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెళ్ల జీవితాల్లో ఎప్పుడు వెలుగు నింపుతారో చెబితే విని సంతోషించాలని ఉంది. అన్నయ్య అంటే మా అన్నయ్యలా ఉండాలని డాక్టర్ సునీత, వైఎస్ షర్మిల చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలను నమ్ముదాం.
ఎన్టీఆర్ అంటే తనకు వల్లమాలిన అభిమానమని, చంద్రబాబు నాయుడికే ఎన్టీఆర్ అంటే ద్వేషమని జగన్ అండ్ కో చెబుతున్న మాటలు కూడా రోతగా ఉంటున్నాయి. 1995లో ఏ సందర్భంలో, ఏ కారణంగా ఎన్టీఆర్‌పై పార్టీలో తిరుగుబాటు జరిగిందో జగన్ వంటి వారికి తెలుసా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి ఎంతగా ఇబ్బంది పెట్టారో JAGAN అండ్ కోకు తెలియదు.
తెలుగు గంగ ప్రాజెక్టుకు నికర జలాలు మాత్రమే కావాలంటూ ఆందోళన చేసిన వైఎస్ఆర్, ఒక దశలో ఎన్టీఆర్ సచివాలయానికి వెళ్లకుండా అడ్డుపడటంతో ఆయన మండుటెండలో సచివాలయం ప్రధాన గేటు ఎదుట నడి రోడ్డుపై పడుకుండి పోయింది మరచిపోయారా?
అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి కడప జిల్లాకు వెళ్లిన ఎన్టీఆర్‌ను అతిథి గృహం వెలుపలకు రాకుండా రాజశేఖర రెడ్డి అడ్డుకున్న విషయం గుర్తుందా? మరో సందర్భంలో హైదరాబాద్ అబిడ్స్‌లోని ఎన్టీఆర్ స్వగృహంలోకి చొచ్చుకుపోయి రాజశేఖర రెడ్డి బైఠాయించిన విషయం మరిచారా?
అప్పటికే గండిపేట కుటీరానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ నిద్రలేచి మరీ అబిడ్స్ చేరుకునే పరిస్థితి కల్పించింది ఎవరు? దీన్నిబట్టి, రాజశేఖర రెడ్డికి గానీ, జగన్మోహన్ రెడ్డికి గానీ ఎన్టీఆర్‌పై ఎంత ప్రేమ ఉందో అర్థం కావడం లేదా?
తెలుగుగంగ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలని ఆందోళన చేసిన రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయమే మరచిపోయారు.అంతా రాజకీయం! ఇప్పుడు 1995లో ఎన్టీఆర్ ఏ పరిస్థితుల్లో పదవీచ్యుతుడు అయ్్యారో చూద్దాం.
భార్య రూపంలో లక్ష్మీపార్వతి తన జీవితంలోకి ప్రవేశించి ఉండకపోతే ఎన్టీఆర్‌కు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అప్పట్లో లక్ష్మీపార్వతి ఎంత అరాచకంగా వ్యవహరించారో ఇప్పటి యువతకు తెలియదు.
వడ్డాణం కొనిపెడితేనే మంత్రి పదవి ఇప్పిస్తానని లక్ష్మీపార్వతి తనతో బేరం పెట్టారని ప్రస్తుత తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తాజాగా ‘ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు ! అది నిజం కాదని లక్ష్మీపార్వతి ఖండించలేదే! తెలుగుదేశం పార్టీ మొత్తం లక్ష్మీపార్వతి కబంధ హస్తాలలో చిక్కుకుపోయినందున పార్టీని కాపాడుకోవడం కోసమని విధిలేని పరిస్థితులలో చంద్రబాబు నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది.
అప్పట్లో మంత్రివర్గం నుంచి చంద్రబాబును తొలగించి తనను మంత్రిగా నియమించాలని ఎన్టీఆర్‌పై లక్ష్మీపార్వతి ఒత్తిడి తేవడం నిజంకాదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ను అనేక విధాలుగా చికాకు పెట్టిన వైఎస్ఆర్ తనయుడైన JAGAN పార్టీ పంచన చేరి లక్ష్మీపార్వతి ఇప్పుడు సేదతీరుతున్నారు కదా! ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ద్వేషం మాత్రమే ఉందని ప్రజలను నమ్మించడానికి JAGAN అండ్ కో మళ్లీ కుయుక్తులకు తెర లేపారు.
ఒక సందర్భంలో చంద్రబాబు ఎన్టీఆర్‌ను ‘వాడు’ అని సంబోధించినట్టుగా వీడియోను ఎడిట్ చేసి ప్రదర్శించారు. ఎన్టీఆర్ వంటి మహనీయుడిని ‘వాడు, వీడు’ అని సంబోధించే దుస్సాహసాన్ని నేను గానీ, చంద్రబాబు గానీ చేయగలమా?
మరో సందర్భంలోJAGAN రెడ్డి పనైపోయిందని చెప్పిన చంద్రబాబు, ‘వాడు’ అన్న పదాన్ని యథాలాపంగా ప్రయోగించారు. జగన్‌ను ఉద్దేశించి వాడిన పదాన్ని ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అన్నట్టుగా దుష్ప్రచారం చేయడాన్ని మించిన దుర్మార్గం ఏముంటుంది? అర్ధసత్యాలు, అసత్యాలనే నమ్ముకొని రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కూడా వంచననే నమ్ముకున్నారు.
1995లో జరిగిన పరిణామాల తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబే విజయం సాధించారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇది చరిత్ర. అయినా వాస్తవాలను వక్రీకరించి పబ్బం గడుపుకోడానికే జగన్ అండ్ కో అలవాటుపడ్డారు.
తాను చేస్తున్న దురాగతాలను సమర్థించని వారి విశ్వసనీయతను దెబ్బతీయడం ద్వారా ప్రజలు వాస్తవాలు నమ్మకుండా అడ్డుకోవాలన్న కపటత్వంతోనే జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలకు తెర తీస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక శాతం నిజాయితీ ఉన్నా అసెంబ్లీలో ప్రదర్శించిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అది కట్ అండ్ పేస్ట్ కాదని రుజువు చేయగలరా?ప్రజలను ఎల్లకాలం వంచించాలనుకున్నా కుదరని పని.
JAGAN కారణంగా సీఐడీ అధికారులు పదేపదే న్యాయమూర్తులతో చివాట్లు తినాల్సి రావడమే ఆయన పరిపాలన దారితప్పిన తీరుకు నిదర్శనం. సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్టు విషయంలో తగిలిన ఎదురుదెబ్బతోనైనా సీఐడీ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి.
ప్రజలను నమ్మించిన జగన్ ఇప్పుడు కూడా అసత్యాలనే ప్రచారం చేస్తూ ప్రత్యర్థులపై దురభిప్రాయాన్ని కలిగించే పన్నాగానికి తెరలేపుతున్నారు. కులాల మధ్య కుంపట్లు రాజేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక పద్ధతిలో తప్పు పట్టినా కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. చివరకు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు నియంత తరహాలో ప్రజలను కూడా నిర్బంధించే పరిస్థితి తెచ్చారు.
ఈ దుర్మార్గపు పోకడలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఆనందం కలిగిస్తూ ఉండవచ్చు గానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతోకాలం చెల్లుబాటు కావు. ఆనందం కనబడాల్సింది జగన్మోహన్ రెడ్డి కళ్లలో కాదు.. ప్రజల కళ్లలో కనపడాలి. అప్పుడే అది సుపరిపాలన అవుతుంది!