Russia cancer vaccine : గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. క్యాన్సర్ వ్యాక్సిన్ సిద్ధం!

వైద్యరంగంలో రష్యా మరోసారి చరిత్ర సృష్టించింది. రష్యా తన క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైందని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలోకి ప్రవేశించింది. ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే రష్యా పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి గురించి కీలక వివరాలు వెల్లడించారు. ప్రీ-క్లినికల్ పరీక్షల్లో ఇది విజయవంతమైందని, క్యాన్సర్ కణాల పెరుగుదలను, వాటి వ్యాప్తిని అరికట్టడంలో సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు.

ఈ వ్యాక్సిన్ mRNA ఆధారిత సాంకేతికతతో తయారు చేయబడింది. ప్రత్యేకత ఏమిటంటే – ప్రతి రోగి ట్యూమర్ కణాల జన్యు సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఈ వ్యాక్సిన్ వ్యక్తిగతంగా తయారు చేయబడుతుంది. దీంతో ఇది నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. నిపుణులు దీన్ని క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పు అని అభివర్ణిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ “ఎంటెరోమిక్స్” పేరుతో క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇవి విజయవంతం అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది క్యాన్సర్ రోగులకు ఇది కొత్త ఆశగా మారనుంది.

గతంలో కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్-వి” తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని గామాలెయా సెంటర్ ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే అవకాశం లేదా కనీసం దీర్ఘకాలిక వ్యాధిగా మార్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు విశ్వసిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ఇలాంటి వ్యాక్సిన్‌లపై పని చేస్తున్నప్పటికీ, రష్యా ఈ పోటీలో ముందంజలో ఉంది.

Leave a Reply