Eye Care Tips: మనకు కళ్లు సరిగ్గా కనిపిస్తేనే.. ఏ పనైనా సరిగ్గా చేయగలం. కానీ, ఈ డిజిటల్ కాలంలో ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ (Electronic gadgets) లేకుండా రోజు గడవటం కష్టమమే. కంప్యూటర్/ మొబైల్‌కు గంటల తరబడి చూస్తూ ఉండటంతో.. కంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు వయసు మీద పడిన తర్వాత.. కళ్లకు అద్ధాలు వచ్చేవి. ప్రస్తుతం ఒత్తిడి, పోషక ఆహార లోపం, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ (electronic gadgets) కారణంగా.. చిన్న పిల్లలకు స్పెట్స్ వస్తున్నాయి. మన కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజులో ఓ 10నిమిషాలు కళ్ల కోసం సమయం కేటాయించి చిన్నపాటి వ్యాయమం చేస్తే.. కంటి సమస్యలు రావు. ముందుగా రిలాక్స్‌గా కూర్చోవాలి. రెండు కళ్లను పెద్దవిగా చేసి, తల కదిలించకుండా కను గుడ్లను మాత్రమే కుడి నుంచి ఎడమకు.. ఎడమ నుంచి కుడికి.. అలాగే, పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి మెల్లగా తిప్పూతూ ఉండాలి. తర్వాత కనుగుడ్లను కంటిలోపలి చివరంచుల వరకూ తీసుకెళ్తూ.. తిప్పాలి. మళ్లీ వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇలా 10నుంచి 20సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కంటిలోని రక్తనాళాలు యాక్టివ్ అవుతాయి. కళ్లలో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.
ప్రతీరోజూ బ్లూ లైట్‌ని ఎక్కువగా చూడటం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్- విజన్ సిండ్రోమ్, డిజిటల్ ఐ స్ట్రైన్ సమస్యలకు దారితీస్తుంది. కంప్యూటర్, టీవీ, ల్యాప్‌టాప్, సెల్‌ఫొన్స్ వంటి డిజిటల్ పరికరాలు వాడేసమయంలో కచ్చితంగా యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ అద్దాలు వాడాలని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ ‘ఎ’ మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇందులో ఉండే రెటినాల్, బీటా కెరోటిన్ కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యారెట్, ఆకుకూరల్లో ఈ విటమిన్ ‘ఎ’ పుష్కలంగా లభిస్తుంది.
ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూన్, సార్డినెస్, ట్రౌట్, మ్యాకరెల్ చేపలను ఎక్కువగా తినాలి. వీటితో పాటు వాల్నట్స్, బాదం, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, అవకాడోలను రెగ్యులర్‌గా తీసుకోవాలి. ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తాగాలి. అప్పుడే మన శరీరంలో కావలసినంత తేమ ఉంటుంది. దీనివల్ల కళ్లు కూడా పొడిబారకుండా ఉంటాయి.
టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి వీటికి దూరంగా ఉండటం మంచిది. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి. రిపైన్డ్ ఆహారం తగ్గించండి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించండి. ఇవి కళ్లు పొడి బారేలా చేస్తాయి.