Meher Ramesh: మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి గురువారం (మార్చి 27) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న మెహర్ రమేష్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సత్యవతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “దర్శకుడు మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి గారి మరణ వార్త బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నా చిన్నతనంలో మెహర్ కుటుంబం విజయవాడ మాచవరం ప్రాంతంలో నివసించేది. వేసవి సెలవుల్లో వారి ఇంటికి వెళ్లే అనుభవం గుర్తుకొస్తుంది” అని పేర్కొన్నారు.

మెహర్ రమేష్ విజయవాడలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. మాచవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన రమేష్, గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు. దర్శకుడిగా మారే ముందు, ఆయన బాబీ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. అనంతరం 2004లో కన్నడ చిత్రమైన “వీర కన్నడిగ” ద్వారా దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తెలుగులో “ఆంధ్రావాలా”గా రీమేక్ చేయబడింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అజయ్, కంత్రీ, బిల్లా సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. కానీ, షాడో, శక్తి, భోళా శంకర్ వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించలేదు.

Leave a Reply