Aishwarya Rai: ఇకపై ఐశ్వర్య రాయ్ ఫొటోలు వాడితే కుదరదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా తన ఫోటోలు, వీడియోలను వాడుకుంటున్నారని ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాణిజ్య ప్రయోజనాల కోసం పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఆమె ఫొటోలను ఉపయోగిస్తున్నాయని, అంతేకాక కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్‌గా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గోప్యతా హక్కులను కాపాడాలని, దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఐశ్వర్య కోర్టును కోరారు.

ఐశ్వర్యకు ఊరట

ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. ఇకపై ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా ఆమె పేరు, ఫొటోలు ఎవరూ వాడరాదని స్పష్టం చేసింది. ఈ రకమైన చర్యలు ఆమె ఆర్థిక నష్టం, గౌరవప్రతిష్టకి కారణమవుతాయని కోర్టు పేర్కొంది. అందువల్ల ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపింది.

ఫొటోలు వెంటనే తొలగించాలి

ఐశ్వర్య పిటీషన్‌లో పేర్కొన్న URL లను వెంటనే తొలగించి బ్లాక్ చేయాలని, సదరు ఈ-కామర్స్ సైట్స్, గూగుల్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు అందిన 72 గంటల్లో ఆ లింకులు తొలగించాలని స్పష్టం చేసింది. అలాగే ఏడు రోజుల్లో పూర్తిగా బ్లాక్ అయ్యేలా కేంద్ర ఐటీ, సమాచార శాఖ చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు సూచించింది.

Leave a Reply