Divorce : భార్యకు భరణంగా ఏడు బస్తాల నాణేలు.. భర్తకు షాక్ …
Divorce : రాజస్థాన్ కోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసలు వివరాలలోకి వెళ్ళితే రాజస్థాన్ లోని జైపూర్ హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్ అనే వ్యక్తికి 12 ఏళ్ల కిందట సీమా అనే మహిళతో వివాహమైంది. కొంతకాలం తరువాత సీమ భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు గత ఐదేళ్లుగా విచారణ కొనసాగుతోంది. అప్పటి వరకు సీమకు నెలకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని దశరథ్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే, అతడు 11 నెలలుగా ఆ సొమ్మును ఇవ్వడం లేదు. దీంతో, సీమ మళ్లీ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతడిపై కోర్టు రికవరీ వారెంట్ జారీ చేసింది. డబ్బు చెల్లించేందుకు అతడు నిరాకరించడంతో పోలీసులు జూన్ 17న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్‌ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
అయితే.. దశరథ్ అరెస్ట్ కావడంతో సీమకు చెల్లించాల్సిన డబ్బును అతడి కుటుంబసభ్యులు ఏడు బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. రూ.55 వేలకు సమానమైన రూ.1, రూ.2 నాణేలు వాటిలో ఉన్నాయి. 280 కేజీల దాకా 280 కేజీల ఉన్నాయి ఆ సంచులు. అయితే.. ఆ డబ్బును తీసుకునేందుకు సీమ నిరాకరించారు. తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా తీసుకువచ్చారని ఆరోపించారు. న్యాయమూర్తి మాత్రం నాణేల రూపంలో దశరథ్ డబ్బు చెల్లించవచ్చని తెలిపారు. అయితే, ఆ నాణేలన్నిటినీ అతడే స్వయంగా లెక్కించాలని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు డబ్బు కోర్టు అధీనంలోనే ఉంటుందని తెలిపారు. విచారణ తేదీ రోజున డబ్బును దశరథ్ లెక్కించి రూ.వెయ్యి చొప్పున ప్యాకెట్‌లుగా విభజించి, కోర్టులో వాటిని భార్యకు అప్పగించాలని తేల్చి చెప్పారు.