కిడ్నీలను స్లో పాయిజన్‌లా పాడుచేసే డేంజరస్ అలవాట్లివి.. జాగ్రత్త

రక్తంలో చేరే మలినాలను వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటిని, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని ముఖ్య అంచనా. ఇంత ముఖ్యమైన బాధ్యత నిర్వహించే ఈ అవయవాలను మీరెలా సంరక్షించుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మరిచిపోయే విషయాల్లో కిడ్నీ ఆరోగ్యం కూడా ఒకటి. జీవనశైలి, ఆహార అలవాట్ల దగ్గరనుంచి పలు రకాల వ్యసనాలు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కారణాలుగా ఉంటున్నాయి.

ముఖ్యంగా మనం రోజూ చేసే కొన్ని చిన్న పొరపాట్లు దీర్ఘకాలంలో కిడ్నీల ఆరోగ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. ఈ ప్రమాదకర అలవాట్ల నుంచి కిడ్నీలను కాపాడుకోవాలంటే ఇప్పుడే వీటి గురించి అవగాహన పెంచుకోవాలని చెప్తున్నారు. మంచి నీళ్లతో ఆరోగ్యం.. చాలా మందికి నీళ్లు తాగే అలవాటు చాలా తక్కువగా ఉంటుంది. మరికొంత మంది ఆరోగ్యానికి మంచిదని లీటర్లకు లీటర్లు నీళ్లను తాగేస్తుంటారు. ఈ రెండూ మీ కిడ్నీల ఆరోగ్యానికి మంచిది కాదు. ముందు మీ శరీరం ఇచ్చే సంకేతాలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. మీ శరీరానికి నీరు అవసరమని అది మీకు చెప్తూనే ఉంటుంది. కానీ పనుల్లో పడి ఈ సంకేతాలను విస్మరిస్తుంటారు. ఇలా నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల రక్తం ఉండాల్సిన దానికన్నా చిక్కగా తయారవుతుంది. దీంతో రక్తంలోని వ్యర్థాలను మీ కిడ్నీలు ఫిల్టర్ చేయలేవు. ఇది కచ్చితంగా మీ కిడ్నీల్లో రాళ్ల సమస్యను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిసినా కూడా చాలా మంది ఈ అలవాట్లను కొనసాగిస్తుంటారు. సిగరెట్ స్మోకింగ్ అలవాటు కారణంగా ముందుగా ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తులు. ఆ తర్వాత ఆ ప్రభావం కచ్చితంగా కిడ్నీల మీద ఉంటుందంటున్నారు. ఇది కిడ్నీలకు రక్త సరఫరాను అడ్డుకుంటుంది. ఫలితంగా వ్యర్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. కొందరిలో ఈ సమస్య తీవ్రమై డయాలసిస్ కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా స్మోకింగ్ అవాటును మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఉప్పు లేదా సోడియం ఎక్కువగా ఉన్న ఆహారం రక్తపోటును పెంచుతుంది అలాగే మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. ఆహారంలో రోజుకి కొంత మోతాదులో మాత్రమే ఉప్పు అవసరం ఉంటుంది. ఒకసారి వంటల్లో ఉప్పు వేసిన తర్వాత ఇక మళ్లీ దాని జోలికి వెళ్లకపోవడమే బెటర్. అధిక మోతాదులో ఉప్పు వాడకం ద్వారా బాడీలో సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. ఇవి కాలక్రమేణా కిడ్నీల పనితీరును మందగించేలా చేస్తుంది. అందుకే ఉప్పు వాడకాన్ని మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక కాఫీలు, టీలు, జ్యూసులు.. ఇలా ప్రతి దాంట్లో చక్కెర లేకుండా రోజు గడవని పరిస్థతి. చాలా మంది ఇళ్లల్లో వీటితో పాటు అదనంగా స్వీట్లకూ ప్రాధాన్యం ఇస్తుంటారు. చక్కర మోతాదు మించితే అది కచ్చితంగా కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. చక్కరలో ఉండే హానికారక పదార్థాలు కిడ్నీలకు రక్తాన్ని తీసుకెళ్లే నరాల పనితీరును చెడగొడతాయి. ఫలితంగా అది కిడ్నీ డ్యామేజ్ కు కారణమవుతుంది. ఇక తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, అలసట, దురద వంటి లక్షణాలు మీ కిడ్నీల ఆరోగ్యం పాడైందని తెలిపే సంకేతాలు. మీకు కూడా వీటిలో ఏదైనా లక్షణం తీవ్రంగా ఉంటే అప్రమత్తం కావాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అలవాట్లకు దూరంగా ఉంటూ ఎప్పటికప్పుడు కిడ్నీల ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండటం వల్ల ఈ డేంజరస్ వ్యాధి నుంచి బయటపడొచ్చని వైద్యులు అంటున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh