Bus Accident: బ్రిడ్జిపై నుంచి లోయలో పడ్డ బస్సు 15 మంది దుర్మరణం
Bus Accident: దేశం లో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి రోడ్డు ప్రమాదమే ఈ ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఖర్గాన్ జిల్లాలో సంభవించింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు.
ఖర్గాన్ జిల్లాలో లోని శ్రీఖండ్ నుంచి ఇండోర్‌కు బయలుదేరింది ఎంపీ 10 పీ 7755 అనే ప్రైవేటు బస్సు. మార్గమధ్యలో డోంగర్గావ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. బోరాద్ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై నుంచి వెళ్తోన్న సమయంలో అదుపు తప్పింది. వేగంగా బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీ కొట్టి కిందపడింది. సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న వంతెన అది.
Also Watch This
అంతపై నుంచి కిందపడేసరికి బస్సు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ విషాద ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందిన వెంటనే ఖర్గాన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ధరం వీర్ సింగ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు. అలాగే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ ఘటన స్థలాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనలో చనిపోయిన వారికి కుటుంబాలకు రూ.4లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొంది. అయితే ప్రమాద సమయంలో బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోందని ప్రత్యక్ష సాక్షులు వివరించినట్లు పేర్కొన్నారు. ఓవర్ లోడ్ కారణంగా బస్సు అదుపు తప్పిందనే కోణంలో దర్యాప్తు సాగిస్తామని ఎస్పీ చెప్పారు.