మతం మారిస్తే మరణశిక్ష.. సీఎం సంచలన నిర్ణయం..!

మతం మార్చేవారికి మరణశిక్ష విధిస్తామంటూ మధ్యప్రదేశ్‌ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛా చట్టం ద్వారా మతం మార్చే వారిని ఉరితీసే నిబంధనను తమ ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. అలాంటివారికి జీవించే హక్కు ఇవ్వకూడదన్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. మన సమాజంలో ఏ విధమైన మతమార్పిడిని ప్రోత్సహించకూడదని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక శక్తుల దుష్ప్రవర్తనలను అరికడతామన్నారు. ‘అమాయక బాలికలపై లైంగిక వేధింపుల కేసుల్లో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అందుకే మరణశిక్ష విధించే నిబంధనను రూపొందించాం. బలవంతంగా లేదా ప్రజలను ప్రలోభపెట్టి దుష్ప్రవర్తనకు పాల్పడే వారిని మా ప్రభుత్వం విడిచిపెట్టబోదు. అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించే హక్కు ఇవ్వకూడదని మేము కోరుకుంటున్నాం’ అని సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు.

ఇక ఇదే సందర్బంలో రైతులకు కేవలం రూ.5కే విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని చెప్పారు. పర్మినెంట్ పవర్ కనెక్షన్‌ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతులకు ఎల్లప్పుడూ మంచి చేయాలని, అన్నదాత జీవితాలు మెరుగుపడాలని తాము కోరుకుంటామన్నారు.

Leave a Reply