కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నాయకుడు అమిత్ షా ఏపీలో పర్యటించనున్నారు. అసలు ఈ నెల 4(బుధవారమే) ఆయన పర్యటన ఉంటుందని ముందుగా సమాచారం అందింది. అయితే, కేంద్రంలో కీలకమైన వ్యవహారం ఉండడంతో ఆయన తన పర్యటనను ఈ మూడు రోజులకు వాయిదా (నెల 8)కి వేసుకున్నారు. ఈ నెల 8న ఆయన రెండు జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. దీని ప్రకారం ఆయన ఆయా జిల్లాల పార్టీ నాయకులతో భేటీ అవుతారు. అలాగే తిరుపతిలో మాత్రం జేపీ నడ్డా పదో తేదీన సమావేశం పెట్టనున్నారు. ఈ ఇద్దరు నేతల బహిరంగసభలపై ఈ సారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమ పార్టీ నేతలకు వారు రోడ్ మ్యాప్ ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే ఒకవైపు జనసేన పార్టీ మాతోనే ఉందని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము టీడీపీతో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో బీజేపీని ఎవరూ పట్టించుకోకుండా ఉండటం లేదు. రెండు పార్టీల అగ్రనేతలు బీజేపీ హైకమాండ్ వద్దకు పదే పదే వెళ్తున్నారు. తమపై చల్లని చూపు కొనసాగించాలని జగన్ అదే పనిగా బీజేపీ పెద్దల్ని కోరుతున్నారు. వారు అడిగిన పనులన్నీ చేస్తున్నారు. చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారు. ఆయనకూ బీజేపీతో కలవాలన్న ఉద్దేశం లేకపోతే.. కనీసం.. బీజేపీకి తాము దూరం కాదు అన్న అభిప్రాయాన్ని కల్పించడానికైనా ఆయన ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. అయితే.. జనసేన మాత్రం వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని చెబుతోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతానని కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షా వైఖరి ఏంటి? ముఖ్యంగా టీడీపీ విషయంలో ఆయన ఎలా ముందుకు సాగాలని అనుకుంటున్నారనేది కూడా తేలి పోనుందని తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో ఎన్నికల నాటికి చేయాల్సిన ప్రచారం.. రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకునుఎలా పొదివి పట్టుకోవాలనే అంశాలపైనా షా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.