ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంలో జనసేన పార్టీ తన అభ్యర్థిగా కొణిదల నాగబాబును ప్రకటించింది. త్వరలో ఆయన నామినేషన్ కూడా వేయనున్నారు. గతంలో నాగబాబుకు మంత్రి పదవి ఖాయం అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈక్రమంలో ఆయనకు MLA కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడం పై వైసీపీలో చర్చనీయంగా మారింది. ఈ విషయం తెలిసి వెంటనే వైసీపీ నేతలు ఎవరికి వారు తమ తమ కోణంలో స్పందించటం మొదలుపెట్టారు. కొందరు నాగబాబు మినిస్టర్ అవ్వడానికి లైన్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నారు.
నాగబాబును MLC గా ప్రకటించడంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. అడ్డదారిలో అన్నని మంత్రి చేయడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి MLC పదవి ఇచ్చారని ఆయన ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్‌ను టార్గెట్‌గా చేస్తూ.. అన్నను దొడ్డిదారిన మంత్రి వర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. అటు కూటమి ప్రభుత్వం నాగబాబుకు మంత్రి పదవిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీతో నాగబాబుని ఆపేస్తారా ? లేక మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే గతంలో నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటున్నామని మూడు నెలల కిందట టీడీపీ హైకమాండ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకంతో ఆ నోట్ రిలీజ్ అయ్యింది.
నాగబాబు మంత్రి అయితే అన్నదమ్ములిద్దరూ మంత్రులుగా ఉన్న ఏకైక సభగా కూటమి ప్రభుత్వం గుర్తింపు పొందనుందా.. అనే చర్చ జరుగుతోంది. ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఒకే ప్రభుత్వంలో మంత్రులుగా ఉండటం లాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇక గతంలో వైసీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రులతో సభ కొనసాగగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులే ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆ ఒక్క కెబినెట్ మంత్రి పదవిని బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కానుండటంతో ఆ అవకాశం బీజేపీదా, జనసేనదా అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో మొదలైంది. మొత్తం మీద వైసీపీ నేతలు అటు మైండ్ గేమ్ తో పాటు ఇటు జనసేన నేత పవన్ పై గట్టి విమర్శలతో తమ ప్రతీకారం తీర్చకుంటున్నారా అనే సందేహం కలుగుతుంది.