Nandamuri నందమూరి సంస్కారం…న భూతో న భవిష్యతి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన సింప్లిసిటీతో అభిమానుల మనసు గెలిచాడు. కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకి ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకడిగా అక్కడికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ …వేదికపై దివంగత పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశ్విని, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తిని గౌరవించిన విధానానికి అక్కడ ఉన్న వారందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వేదికపై కుర్చీలు తడిచిపోయి ఉండటంతో అశ్విని, సుధామూర్తి వాటిపై కూర్చునేందుకు ఇబ్బందిపడటాన్ని వెనక నుంచి గమనించిన జూనియర్ ఎన్టీఆర్.
వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉన్న కర్చీప్ తీసుకుని స్వయంగా అశ్విని కూర్చోబోయే కుర్చీని శుభ్రం చేశారు. అలానే సుధామూర్తి కుర్చీని కూడా శుభ్రం చేయించి ఆమెని తొలుత కూర్చోమని రిక్వెస్ట్ చేశారు. చివరికి తాను కూర్చోబోయే కుర్చీనీ కూడా జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా శుభ్రం చేసుకుని సింప్లిసిటీని చాటుకున్నారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘‘మహిళల్ని ఎలా గౌరవించాలో ఎన్టీఆర్‌కి బాగా తెలుసు’’ అంటూ కొనియాడుతున్నారు… మరో వైపు
కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘కర్ణాటక రత్న’ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పునీత్ భార్య అశ్విని అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడారు.. కర్ణాటక ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు ‘కర్ణాటక రాజ్యోత్సవ’ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. ‘‘నేను ఇక్కడికి అతిథిగా కాదు అప్పు స్నేహితుడిగానే వచ్చాను.
ఎవరైనా కుటుంబ పెద్దల నుంచి ఇంటి పేరునో వారసత్వాన్నో పొందుతారు. కానీ వ్యక్తిత్వాన్ని మనమే సంపాదించుకోవాలి. అహంకారం లేని వ్యక్తిత్వం, ఎప్పుడూ చిరునవ్వుతో యావత్ రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అందుకే ఈ అవార్డు ఆయనకు దక్కింది. అతని నవ్వులో ఉన్న సంపద ఇంకెక్కడా దొరకదు’’ అని అన్నారు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకలో గొప్ప సూపర్ స్టార్, ఒక గొప్ప కొడుకు, ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప ఫ్రెండ్ ఒక గొప్ప యాక్టర్, డ్యాన్సర్, సింగర్ వీటన్నిటికి మించి ఒక గొప్ప మానవతావాది అని ఎన్టీఆర్ అన్నారు. తన ఉద్దేశంలో కర్ణాటక రత్న అంటే అర్థమే పునీత్ రాజ్ కుమార్ అని అన్నారు ఎన్టీఆర్. పునీత్ గురించి ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడటం విశేషం.
పునీత్ రాజ్ కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసింది. కార్యక్రమం మొదలైన కాసేపటికే అక్కడ జోరున వర్షం పడింది. పునీత్ పై ప్రేమతోనే వాన పడిందా అన్నట్లు మారింది అక్కడి వాతావరణం. అలాగే కార్యక్రమం ప్రారంభం అయింది. ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో కూడా వర్షం పడుతూనే ఉంది. అయినా కార్యక్రమం అట్టహాసంగా సాగింది.
పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. పునీత్ రాజ్ కుమార్ ను కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్, అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తన విలక్షణ నటన, వ్యక్తిత్వం తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పునీత్. ఐదేళ్ల వయసులోనే పునీత్ సినీ రంగ ప్రవేశం చేశారు. పునీత్ రాజ్‌కుమార్ 1976లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ కలిసి నటించారు పునీత్. బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు విరామం తీసుకున్నారు. తర్వాత 2002 లో ‘అప్పు’ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పునీత్. కేవలం సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు పునీత్ రాజ్ కుమార్.
బాలకృష్ణ సంస్కారానికి ప్రేక్షకులు ఫిదా.
పాత తరం నటీనటులను గౌరవించడంలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. పెద్దలకు ఆయన ఎంతో మర్యాద ఇస్తారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సాక్షిగా మరోసారి బాలకృష్ణ పెద్దలకు ఇచ్చే మర్యాద ప్రేక్షకులకు తెలిసి వచ్చింది. సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మి పాదాలకు ఆయన గౌరవంగా నమస్కరించారు.
ఆ ఫోటో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మికి శకపురుషుడి శతాబ్డి పురస్కారాన్ని ఆదివారం తెనాలిలో అందజేశారు. ఆమెను సోమవారం హైదరాబాద్‌లో బాలకృష్ణ వ్యక్తిగతంగా కలిశారు. సినీ ప్రముఖులు సమక్షంలో ఆమెకు గౌరవ సత్కారం చేశారు.’సిపాయి కూతురు’తో ఎల్. విజయలక్ష్మి బాలనటిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. . ఎన్టీఆర్‌తో పలు చిత్రాలు చేశారు. ”ఎల్. విజయలక్ష్మిగారికి శిరస్సు వచ్చి వందనాలు సమర్పిస్తున్నాను.
సినిమాల్లో నటించడమే కాక… రాజకీయ, ప్రజా సేవ రంగాల్లో సేవలు చేసిన వ్యక్తులను సత్కరించుకొనే మహత్కర కార్యక్రమం ఇది. విజయలక్ష్మి గారు వందకు పైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, జావలి వంటి ఎన్నో నాట్యాలు ప్రదర్శించారు. సినిమా ప్రయాణం ఆపేశాక…
నాన్నగారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చదివారు. వర్జీనియా యూనిర్శిటీలో బడ్జెట్ మేనేజర్‌గా ఉన్నారు. అని ఆమె గురించి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.పురస్కార గ్రహీత ఎల్. విజయలక్ష్మి మాట్లాడుతూ ”నేను చిన్నతనం నుంచి రామారావుగారిని ఆదర్శంగా తీసుకున్నా. ఎన్టీఆర్ గారి నుంచి చాలా విలువలు నేర్చుకున్నాను. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేను చదువు కొనసాగించా” అని అన్నారు.
తెల్ల దొరకు తెలుగు ఆవకాయ రుచి చూపించిన మెగాస్టార్!
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్.. మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మెగాస్టార్ చిరు.. ట్విట్టర్‌లో షేర్ చేశారు. బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు చిరు తెలిపారు. ” హైదరాబాద్‌కు కొత్తగా వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌ను కలవడం ఆనందంగా ఉంది.
బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నాం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో యూకేకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఆయనకు విందు ఏర్పాటు చేసి.. మన తెలుగు వంటకాలను రుచి చూపించా. నోరూరించే అవకాయను కూడా ఆయన రుచి చూశారు.”మెగాస్టార్‌తో భేటీ తర్వాత బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. టాలీవుడ్ పరిశ్రమ గురించి మెగాస్టార్‌తో చర్చించినట్లు చెప్పారు. కరోనా సమయంలో మెగాస్టార్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
భేటీకి సంబంధించిన ఫొటోలను సైతం పోస్టు చేశారు.” మీ అందమైన ఇంట్లో మీరు నాకు ఇచ్చిన ఆతిథ్యం అద్భుతంగా ఉంది. ఇంట్లో చేసిన దోసె, ఆవకాయ రుచిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది నాకు చాలా కాలంగా గుర్తుండిపోయే ప్రత్యేక సాయంత్రం. మీ రక్తదాన కేంద్రాలలో మిమ్మల్ని మళ్లీ కలవాలని నేను ఎదురుచూస్తున్నాను. ”
కదనరంగంలో దిగిన వీరమల్లు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీర మల్లు’ . ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. అయితే… స్టార్ట్ అయిన రోజున పవన్ కళ్యాణ్ సెట్స్‌లో జాయిన్ కాలేదు. రాజకీయ పరమైన కమిట్‌మెంట్స్ నేపథ్యంలో ఏపీలో ఉన్నారు. అందువల్ల, ఆయన లేని సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించడానికి షూటింగ్ చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి.పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో? ఎప్పుడు కంప్లీట్ అవుతాయో? తెలియదని కొందరు కామెంట్ చేశారు కూడా! రాజకీయాలతో పాటు సినిమాలకూ ఇంపార్టెన్స్ ఇస్తున్నానని పవర్ స్టార్ చేతల్లో చూపించారు.
పవన్ కళ్యాణ్ ఈ రోజు ‘హరి హర వీర మల్లు’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. భారీ సంఖ్యలో గుర్రాలు, ఇంకా వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ మరో పదిహేను 20 రోజులు ఉంటుందని టాక్. మరో మూడు నాలుగు నెలలు షూటింగ్ బ్యాలన్స్ ఉందని… ఒకవైపు షూటింగ్ చేస్తూ, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని పొలిటికల్ కమిట్‌మెంట్స్‌కు టైమ్ కేటాయించాలని పవన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. లేటెస్ట్ క్రేజీ అప్‌డేట్ ఏంటంటే…
‘హరి హర వీర మల్లు’ సినిమాలో మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో మల్ల యోధుడు మల్లుగా పవన్ కనిపించనున్నారు. మన భారత దేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా కోసం ఆ కాలం నాటి సెట్స్ వేశారు.’హరి హర వీర మల్లు’ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్క్ షాప్స్‌లో పాల్గొన్నారు. ఆ మధ్య స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ జరిగాయి.
దానికి పవన్ అటెండ్ అయ్యారు. దాని కంటే ముందు కొన్ని రోజులు స్టంట్స్ ప్రాక్టీస్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తోదోర్ లాజరోవ్ నేతృత్వంలో పవన్ కల్యాణ్, ఇతర తారాగణంపై యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాలని ప్లాన్ చేశారు…..