KTR : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై ఫైర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఫైనల్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను పార్టీ తరఫున పోటీకి నిలబెట్టనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలు దమ్ముంటే తమ అభ్యర్థులను ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్‌లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, 20 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు కష్టాల్లో పడతాయని హెచ్చరించారు.

కాంగ్రెస్-బీజేపీ కలిసే రేవంత్ సర్కార్ నడుస్తోందని విమర్శించిన ఆయన, రాహుల్ గాంధీ నిత్యం విమర్శించే మోదీ, అదానీలను సీఎం రేవంత్ వెనుకేసుకొస్తున్నాడని ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారి రేవంత్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఫైర్ అయ్యారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించనుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కారు గుర్తు కావాలా, లేక కాంగ్రెస్-బీజేపీ బేకార్ పాలన కావాలా అన్నది ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply