Jagan Kodi Kathi case:కోడి కత్తి కేసులో జగన్ కి భారీ షాక్ ఇచ్చిన ఎన్ఐఏ
2018లో విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ (ఎన్ఐఏ) కీలక కౌంటర్ దాఖలు చేసింది. ఈ కోడి కత్తి కేసులో కుట్ర కోణం లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ విజయవాడ కోర్టులో ఎన్ఐఏ తాజాగా కౌంటరు దాఖలు చేసింది. అయితే ఈ కేసుతో అక్కడి రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు సంబంధం లేదని కౌంటర్లో ఎన్ఐఏ తెలిపింది. అలాగే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తెలుగు దేశం పార్టీ సానుభూతిపరుడు కాదని స్పష్టం చేసింది
అలాగే ఇటీవల ఏపీ సీఎం జగన్ ను విచారణకు రావాలని విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తానొస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని జనజీవనానికి సమస్యలు తలెత్తుతాయని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్ఐఏ తనపై హత్యాయత్నానికి సంబంధించి కుట్ర కోణాన్ని వెలుగులోకి తేలేదని కుట్ర కోణాన్ని దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు.
ఈ నేపథ్యంలో కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ కోర్టులో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు అంశాలను తన కౌంటరులో పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని సీఎం జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టుకు ఎన్ఐఏ విజ్ఞప్తి చేసింది. మరోవైపు తమ వైపు వాదనలకు రెండు రోజుల సమయం కావాలని జగన్ తరపు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేశారు. 17న వాదనలు చెప్పాలని అదే రోజు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కాగా వాయిదాలు ఇవ్వద్దు అంటూ నిందితుడి తరపు న్యాయవాది అభ్యర్థించారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన కోడి కత్తి స్క్రిప్ట్ ను జగన్ అమలు చేశారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఈ ఘటనతో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు చేసిన డ్రామా ఈరోజు బద్దలైందని విమర్శించారు. సీఎం జగన్ డ్రామాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఇప్పుడు ఎన్ఐఏ మీద కూడా నమ్మకం లేదంటారా? అని ప్రశ్నించారు. కుట్రలు, హత్యలు, దారుణాలు చేసిన జగన్ ని రాజకీయాల నుంచి అనర్హుడిగా ప్రకటించాలన్నారు.
అసలు ఆనాడు జగన్ పై ఎలాంటి దాడి జరగలేదని అదంతా ఎన్నికల్లో సానుభూతి కోసం ఆడిన నాటకం అని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే జగన్ రెడ్డి ఈ కేసు నుంచి బయట పడటానికి ఇలా కొత్త నాటకాలు ఆడుతున్నారని వారు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు ఎయిర్ పోర్టులో జగన్‌పై దాడి చేసిన నిందితుడు జనపల్లి శ్రీను నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడు. దాడి జరిగిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏ విచారణ చేయించాని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ విచారణ జరిపి చార్జిషీటు దాఖలు చేసింది. అయితే విచారణ ప్రారంభమయ్యే సమయంలో దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని జగన్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద కోడికత్తి కేసును సాకుగా చూపి సీఎం జగన్ రెడ్డి రాజకీయంగా బాగానే లబ్దిపొందారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.