ఆరేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఏపీలో పెను సంచలనం రేపగా.. ఇప్పుడు ఆయన కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు గత ఐదేళ్లలో అనుమానాస్పదంగా చనిపోవడం మరో సంచలనం రేపుతోంది. ఇలా సాక్షులు వరుసగా చనిపోతుండటంపై పోలీసులే షాకవుతున్నారు. వైఎస్ వివేకానంద కేసులోని సాక్షుల మరణాలు విస్తుగొలుపుతున్నాయని వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మరణాలపై దర్యాప్తుకు సెట్ ఏర్పాటు చేశారు. తాజాగా వివేకా హత్య కేసులో ఆయన ఇంటికి గతంలో వాచ్ మెన్ గా ఉన్న రంగన్న చనిపోయాడు. అయితే ముందు ఇది సాధారణ మరణంగానే భావించినా..ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు మార్చి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు.
అంతకు ముందు ఇదే కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ వేర్వేరు కారణాలతో చనిపోయారు. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. వైఎస్ వివేకా హత్య కేసులోని ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.. వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాఫ్తు చేస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని, సాక్షులు ఏయే కారణాలతో, ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. వారికి ఏమైనా ఆనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాఫ్తు జరుగుతోందన్నారు.
సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. సాక్షులు చనిపోయినప్పుడల్లా సీబీఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. అలాంటి ప్రచారాన్ని ఎందుకు, ఎవరు చేస్తున్నారనే కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వాచ్‌మన్ రంగన్న బుధవారం సాయంత్రం చనిపోయాడని, రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ కేసులో సాక్షులుగా వుండి మృతి చెందిన వారి కేసులన్నింటిని దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.