AP:వైసీపీని కలవరపెడుతూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. విపక్ష టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టడంతో వైసీపీ అప్రమత్తమైంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించిన విధంగానే తెలుగుదేశం పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. వాస్తవానికి అసెంబ్లీలో ఉన్న బలాబలాల్ని చూస్తే వైసీపీ ఆరు ఎమ్మెల్సీ సీట్లు సునాయాసంగా గెల్చుకోవడం ఖాయం. అయితే ఆరు సీట్లకు సరిపడా ఎమ్మెల్యేల తర్వాత తమ క్యాంపులో మిగిలిన ఇతర ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి తమకు మద్దతిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు, ఓ జనసేన ఎమ్మెల్యే ఓట్లు తమకు పడతాయని ఊహించి వైసీపీ ఏడో అభ్యర్ధిని కూడా నిలబెట్టింది. దీంతో ఈ అభ్యర్ధి గెలుపు విషయంలో వైసీపీపీ ఒత్తిడి పెరుగుతోంది. దీనికి కారణం వైసీపీ క్యాంపులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉండటం, అలాగే టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలు విప్ భయంతో ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశాలుండటం దీనికి కారణం.
అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలను ఇప్పుడు పూర్తి స్ధాయిలో కట్టడి చేయాల్సిన పరిస్ధితి అధికార పార్టీకి ఎదురవుతోంది. టీడీపీకి గెలిస్తే ఓ అదనపు స్ధానం, ఓడితే ఇబ్బంది లేని పరిస్దితి ఎదురవుతుండగా వైసీపీకి తాము నిలబెట్టిన ఏడో అభ్యర్ధిని కచ్చితంగా గెలిపించుకోవాల్సిన స్ధితి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల్ని కట్టడి చేసేందుకు జగన్ ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు . అసెంబ్లీతో పాటు బయట కూడా ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు అధికార పార్టీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యూహాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి
పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేల కొద్దీ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఓటింగ్ విషయంలో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు అదే అంశం ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ వైసీపీని కలవరపెడుతోంది. దీంతో తమ ఎమ్మెల్యేలకు ఈ రోజు అసెంబ్లీలో మాక్ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఉదయం 10.30 కి అసెంబ్లీ కమిటీ హాల్లో వైసీపీ ఎమ్మెల్యే లకు MLC ఎన్నికలపై మాక్ పోలింగ్ జరుగుతోంది. దీనికి మొత్తం ఎమ్మెల్యేలు తప్పక హాజరుకావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్క ఓటు కూడా నష్టపోకుండా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డిగారు. ఇప్పటికే ప్రతీ 22 మంది ఎమ్మెల్యేలకు ఒక టీం లీడర్ నియమించారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై విప్ కూడా జారీ చేశారు. మంత్రులకు సైతం సీఎం జగన్ అన్ని స్ధానాలు గెల్చుకోవాల్సిందేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలపై నిఘా కూడా పెరిగింది. అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, అనుచరులపై నిఘా పెరిగినట్లు సమాచారం. ఈ మేరకు ఇంటిలిజెన్స్ అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరిని కలుస్తున్నారు, వైసీపీకి కాకుండా టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారిని ఎలా దారికి తెచ్చుకోవాలన్న అంశాలపై అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్‌తో సహా ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.