office timings :మే నెల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఆఫీసులు ఎక్కడో తెలుసా ?
పెరుగుతున్న ఎండలు, విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల నుంచి ఉద్యోగులకు, పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు మార్చాలని నిర్ణయించింది. పిల్లలకు ఒంటి పూట బడుల తరహాలోనే ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని పంజాబ్ సీఎం భగవత్ మన్ శనివారం ప్రకటించారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్లోని గవర్నమెంట్ ఆఫీసులు పని చేస్తున్నాయి. మే 2 నుంచి నూతన పని వేళల ప్రకారం ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు అంటే జులై 15 వరకు ఈ టైమింగ్స్నే ఉద్యోగులు పాటించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులు సహా ఎంతో మందిని సంప్రదించి, వారితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో విద్యుత్ వాడకం తగ్గి, లోడ్ భారం కూడా తగ్గుతుందన్నారు. పంజాబ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివరాల ప్రకారం ఆ రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట వినియోగం మధ్యాహ్నం 1.30 తర్వాత మొదలవుతుంది. ఒక వేళ 2 గంటలకు ప్రభుత్వ ఆఫీసులను మూసేస్తే 300 నుంచి 500 మెగావాట్ల మేర పీక్ లోడ్ తగ్గించడానికి తోడ్పడుతుందని సీఎం భగవంత్ మన్ తెలిపారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తానని సీఎం ప్రకటించారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగుల పనితీరుపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. కొత్త పని వేళలకు తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. కొందరైతే సాయంత్రం 4 కాగానే ఉద్యోగులు మందు కొట్టడానికి బయటకు వెళ్తారంటూ సెటైర్లు పేలుస్తున్నారు. కానీ పంజాబ్ సర్కారు మాత్రం తమ నిర్ణయం వల్ల విద్యుత్ ఆదా కావడంతోపాటు ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపడుతుందనే ధీమాతో ఉంది. ఉద్యోగులు తమ కుటుంబాలతో గడిపే సమయం పెరుగుతుందని ఆప్ సర్కారు చెబుతోంది.
ਪੰਜਾਬ ਦੇ ਸਰਕਾਰੀ ਦਫ਼ਤਰਾਂ ਦਾ ਸਮਾਂ 2 ਮਈ,2023 ਤੋਂ ਸਵੇਰੇ 7.30 ਤੋਂ ਦੁਪਹਿਰ 2 ਵਜੇ ਤੱਕ ਕਰ ਦਿੱਤਾ ਗਿਆ ਹੈ
ਇਹ ਫ਼ੈਸਲਾ 15 ਜੁਲਾਈ,2023 ਤੱਕ ਜਾਰੀ ਰਹੇਗਾ
ਆਮ ਲੋਕਾਂ ਤੇ ਮੁਲਾਜ਼ਮਾਂ ਨੂੰ ਗਰਮੀ 'ਚ ਕੰਮ ਕਰਨ ਤੇ ਕਰਵਾਉਣ ਤੋਂ ਨਿਜ਼ਾਤ ਮਿਲੇਗੀ
—CM @BhagwantMann pic.twitter.com/8vkl44AKAv
— AAP Punjab (@AAPPunjab) April 8, 2023