మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్‌ మృతి

ఒకప్పుడు మావోయిస్టుల ప్రతి కదలికా చర్చనీయాంశం అయ్యేది. ఇప్పుడు కేంద్రం మావోయిస్టులను ఎదుర్కొనేందుకు బలమైన వ్యూహాలతో వెళ్తోంది. అదే సమయంలో అగ్రనేతల్ని పార్టీ ఒక్కొక్కరిగా కోల్పోతోంది.

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఆనంద్‌ అలియాస్‌ కటకం సుదర్శన్‌ కన్నుమూశారు. ఆయన గత నెల 31న గుండెపోటుతో మరణించారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

సుదర్శన్‌ స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తి. వరంగల్‌లో పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసించిన ఆయన కమ్యూనిస్టు భావజాలానికి  ఆకర్షితులయ్యారు.

దీంతో 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో గడుపుతున్నారు. మావోయిస్టు పార్టీలో అంచలంచలుగా ఎదిగిన ఆయన సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ఆనంద్‌, మోహన్‌, వీరేందర్‌జీ అని వివిధ పేర్లతో పిలిచే ఈయనపై హత్య కేసు సహా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

రెండేండ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్‌ హస్తం ఉందని అంటారు. ఈ దాడిలో 70 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు. గత మూడు దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దండకార్యణంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారని చెబుతూ ఉంటారు.

కటకం సుదర్శన్ తల్లిదండ్రులు మల్లయ్య, వెంకటమ్మ 2018లో మృతి చెందారు. తరువాత  ఆయన సతీమణి, మావోయిస్టు నాయకురాలు సాధన గత కొన్నేండ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది. ఇప్పుడు ఆయన చనిపోయారనే విషయాన్ని మావోయిస్టులు ప్రకటనలో తెలిపారు.

కటకం సుదర్శన్ చాలా కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో పాటు డయాబెటిస్, బీపీ సమస్యలతో సతమతం అవుతున్నారని తెలుస్తోంది. గత బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు గుండెపోటుకు గురై ఆయన మరణించినట్లు ప్రకటించారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం, కార్యకర్తలు, దళ కమాండర్లతో పాటు వందలాది మంది సుదర్శన్ స్మారక సభ నిర్వహించినట్లు సమాచారం. అనంతరం విప్లవ సంప్రదాయాలతో కటకం సుదర్శన్ అంత్యక్రియలు నిర్వహించినట్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ వెల్లడించారు.

కటకం సుదర్శన్ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.  సుదర్శన్ మృతి భారత విప్లవోద్యామానికి, ప్రపంచ సోషలిస్టు విప్లవానికి తీరని నష్టాన్ని కల్గించిందని వెల్లడించింది.  ఆనంద్ మృతిపై జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh