margay Darshi case: మార్గదర్శి కేసులో రామోజీరావుకు తన కోడలకు ఏపీ సీఐడీ నోటీసులు
ఈనాడు అధినేత రామోజీరావు, మార్గదర్శి ఛైర్మెన్ రామోజీరావుపై ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రామోజీరావుతో పాటు మార్గదర్శి మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్, అలాగే ఏపీలోని పలు బ్రాంచీల మేనేజర్లపై సీఐడీ కేసు నమోదు చేసింది. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి మార్గదర్శి ఖాతాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్దంగా మళ్లింపు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని. ఏపీ సీఐడీ ఇప్పటికే పలువురు సంస్ధ బ్రాంచ్ ల మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపింది. ఇదే క్రమంలో తాజాగా సంస్ధ ఎండీ శైలజతో పాటు రామోజీ గ్రూప్ ఛైర్మన్ గా ఉన్నరామోజీరావుకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నించేందుకు వీలుగా రామోజీరావుతో పాటు శైలజ కూడా అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం సీఐడీ అధికారులు నాలుగు తేదీల్ని వీరిద్దరికీ సూచించారు. మార్చి 29, 31, ఏప్రిల్ 3, ఏప్రిల్ 6 ఈ నాలుగు తేదీల్లో ఒకరోజు విచారణకు అందుబాటులో ఉండాలని వీరిద్దరికీ జారీ చేసిన వేర్వేరు నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. విచారణ కోసం ఇల్లు లేదా ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని వీరిద్దరిని కోరారు.
ఈ క్రమంలో ఏ 1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, ఏ 2 నిందితులుగా చెరుకూరి శైలాజా కిరణ్, ఏ 3 నిందితులుగా సంబంధింత బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు చేసింది ఏపీసీఐడీ. ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయనే విషయాన్ని సీఐడీ వెల్లడించలేదు. కానీ ఏఏ నగరాల్లో బ్రాంచీపై కేసులు నమోదు చేశారనే విషయాన్ని సీఐడీ వివరించింది.
విశాఖపట్నం, రాజమహేంద్ర వరం, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచులపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అదే సమయంలో నర్సరావుపేట, ఏలూరు, అనంతపురం బ్రాంచీల ఫోన్‌మెన్ పరారీలో ఉన్నారని సీఐడీ తెలిపారు.
మార్గదర్శి అక్రమాల కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ1గా ఉండగా ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ ఏ2గా ఉన్నారు. దీంతో వీరిద్దరిని విచారించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. సమాజంలో వీరికున్న పరువు, ప్రతిష్టల్ని దృష్టిలో ఉంచుకుని ఇతర నిందితుల తరహాలో సీఐడీ కార్యాలయంలో కాకుండా వారి ఇల్లు, లేదా ఆఫీసుల్లోనే వీరిని విచారించేందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.