Sri Rama Navami : భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
తెలుగు రాష్ట్రాలలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శతకోటి సూర్య తేజస్సులతో వెలిగిపోతున్న శ్రీరాముడు, సీతమ్మను పెళ్లాడేందుకు మిథిలా ప్రాంగణానికి చేరుకున్నాడు. అయోధ్య రామయ్యను మనువాడేందుకు సీతమ్మ కూడా పెళ్లిపీటలెక్కింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది.
మిథులా స్టేడియం లోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈరోజు ఉదయం శ్రీసీతారాములు కళ్యాణమండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగింది. ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథులా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామిఅమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు. కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రామనామస్మరణతో మిథులా స్టేడియం మారుమ్రోగుతోంది.
కళ్యాణోత్సవం సందర్భంగా మిథులా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో కళకళలాడుతోంది. ఈ కళ్యాణోత్సవానికి చినజీయర్ స్వామి ఎంపీలు రవిచంద్ర, కవిత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరయ్యారు.
అలాగే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీసీతారామచంద్రుల కల్యాణ మహోత్సవం. మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు స్వామివారు ఆలయానికి ఊరేగింపుగా వేంచేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, 2 నుంచి సాయంత్రం 6 వరకు దర్శనాలు, సాయంత్రం 5 నుంచి 5.30 వరకు ఆరాధన, 6 నుంచి 7 వరకు శ్రీరామ పునర్వస దీక్షలు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు తిరువీధిసేవ, 10 నుంచి 10.30 వరకు నివేదన, 10. 30 గంటలకు ఆలయం తలుపులు మూస్తారు. ఇదిలా ఉండగా మార్చి 31న శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం రోజున ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరచి సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
4.30 నుంచి 6.30 వరకు ఆరాధన, 6.30 నుంచి 10 వరకు సర్వదర్శనాలు, అదే సమయంలో 8 నుంచి 10.30 వరకు శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తులు ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి వేంచేస్తారు. ఉదయం 10.30 నుంచి 12.30 వరకు స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనుంది. మధ్యాహ్నం 12:30 నుంచి ఒంటి గంట వరకు స్వామివారు ఆలయానికి వేంచేస్తారు. ఒంటి గంట నుంచి 2 వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు సర్వదర్శనాలు, 5 నుంచి 5.30 వరకు ఆరాధన, 5.30 నుంచి 9.30 వరకు సర్వదర్శనాలు, రాత్రి 6.30 నుంచి 9.30 వరకు రథో త్సవం జరగనున్నాయి.