కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఒకవైపు అధికార బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, అగ్ర నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. వివిధ పార్టీల అభ్యర్థుల తరుపున సినీ తారలు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు.
అయితే స్టార్ హీరో ఇమేజ్ తో లాభం పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ లోకనాయకుడు. కమల్ హాసన్ ను రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ ను రంగంలోకి దింపారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచార కమిటీలో స్యాండిల్ వుడ్ బ్యూటీ, మండ్య మాజీ ఎంపీ రమ్యా అలియాద్ దివ్యా స్పందనా పేరు ప్రకటించినా మేడమ్ మాత్రం ఇంత వరకు ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ముందుకు రాలేదు.
అలాగే హీరో కమల హాసన్ బెంగళూరులో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న గాంధీనగర, పులకేశీనగర, చిక్కపేట్, కేఆర్ పురం. మహదేవపుర తదితర నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిపారని తెలిసింది.
మక్కల్ నీది మయ్యం అనే ప్రాంతీయ పార్టీ స్థాపించిన హీరో కమల్ హాసన్ తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలు మాత్రం వారిని ఆదరించలేదు. తరువాత కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి టూ కాశ్మీర్ జూడో యాత్రలో ప్రత్యక్షం అయిన కమల్ హాసన్ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు.
వీలు చిక్కినప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న కమల్ హాసన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దగ్గర అవుతూ వచ్చారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హీరో కమల్ హాసన్ ను ఒప్పించి బెంగళూరు నగరంలోని వివిద నియోజక వర్గాల్లో, తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయించాలని ఆయనతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
మే 10న ఎన్నికలు జరగనున్న 224 స్థానాలకు మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫలితాలు మే 13న వెల్లడికానున్నాయి. మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2,427 మంది పురుషులు, 184 మంది మహిళలు, మరో 2 మంది అభ్యర్థులు ఉన్నారని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.