పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి విదితమే. అయితే ప్రతిభావంతులైన ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం జగన్ పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, గొప్పవారు కావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారంనాడు విద్యా దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.
ఇప్పటివరకు 26,98,728 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి దశ దిశను చూపిస్తుందని సీఎం జగన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే నిరుపేద కుటుంబాలను మార్చేసే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ విద్యాలయాలను, వాటిలో బోధనా పద్ధతుల రూపురేఖలను సమూలంగా మార్చేశామని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లతో పోటీపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దామని, క్లాస్ రూమ్ లలో డిజిటల్ బోధనకు రూపకల్పన చేశామని చెప్పారు.
అలాగే విద్యార్థుల చదవులపై చేస్తున్న ఖర్చు హ్యుమన్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ గా సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. విద్యార్ధుల్లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. విద్యార్ధులకు ఉపాధి లభ్యమయ్యే లా ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చామన్నారు. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్సును ప్రవేశ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిభ చూపించే ప్రతి విద్యార్ధికి తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటి నుంచి ఓ సత్య నాదెళ్ల రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా కొవ్వూరులో నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఏకమౌతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వంతో మంచి జరిగిందని భావిస్తే అండగా నిలవాలని ఏపీ సీఎం జగన్ ప్రజలను కోరారు. .