TTD Special Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
కలియుగ దైవం తిరుమల శ్రీనివాస్ భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వచ్చే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది.
అయితే రానున్న వేసవి తిరుమలలో రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వచ్చే మూడు నెలలకు సంబంధించిన సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ అయితే ఇప్పుడు ప్రత్యేక ప్రవేవ దర్శనం పైన ప్రకటన చేసింది. జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే . ఇక, శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఏప్రిల్ నెలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోటా టికెట్లను ఈ నెల 27న విడుదల కానున్నాయి. 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. టీటీడీ వెబ్ సైట్ టీటీడీ యాప్ ద్వారా ఆన్ లైన్ టికెట్లు పొందవచ్చని స్పష్టం చేసింది.
ఏప్రిల్ కు సంబంధించి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించు కునేందుకు వీలుగా టోకెన్లను టీటీడీ ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక, వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ చెబుతోంది. శ్రీవాణి దర్శనాలను తగ్గించాలని నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలను నియంత్రించాలని కోరింది.
అలాగే మార్చి 30, 31వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి శ్రీరామపట్టాభిషేకం ఆస్థానాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మార్చి 30న హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 30న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.
సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది. మార్చి 31న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం స్వామివారిని 63,507 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. స్వామివారికి 29,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
ఇటు హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుతో ప్రారంభమైన హరి కథా సంప్రదాయం మన తెలుగువారి స్వంతమని, తెలుగు భాషలో తప్ప ఏయితరభాషలోను హరికథాగానం లేదని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా.ఆకెళ్ల విభీషణ శర్మ చెప్పారు. అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచర్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీ రామాయణ హరికథా సప్తాహ యజ్ఞం ప్రారంభమైంది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ విభీషణ శర్మ మాట్లాడుతూ, హరికథ లలితకళల సమాహార స్వరూపమన్నారు.
సంగీతం సాహిత్యం నాట్యంమూడింటిలోను ప్రావీణ్యం ఉన్నవారు మాత్రమే హరికథాగానం సమర్ధవంతంగా నిర్వహించగలరని హరికథ విశిష్టతను ఆయన వివరించారు. తుడా సెక్రటరీ శ్రీమతి లక్ష్మి జ్యోతి ప్రజ్వలనంతో శ్రీ సీతారామకల్యాణ హరికథాగానంతో ఈసప్తాహం ప్రారంభమయ్యింది. ఈ సందర్బంగా అన్నమాచార్య ప్రాజెక్టు హరికథా కళాకారిణి శ్రీమతి జయంతి సావిత్రిని శ్రీవేంకటేశ్వర సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్డుబాల, శ్రీ భగవాన్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఘనంగా సత్కరించారు.