తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

Thirumala Thirupathi :తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

కలియుగ దైవం శ్రీ తిరుమల శ్రీవారి దర్శనానికి నడక మార్గంలో వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ ఏప్రిల్ 1 నుంచి మళ్లీ దివ్య దర్శనం టికెట్లను ఇవ్వనుంది టీటీడీ. శనివారం నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు దివ్య దర్శనం టోకెన్లను ఇస్తారు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ఆ తర్వాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మార్చి 20వ తేదీ 2020నాడు దివ్య దర్శన టోకెన్స్‌తో పాటుగా అన్ని దర్శనాలు నిలిపివేశారు టీటీడీ అధికారులు.

ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేశాక ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. విడతల వారీగా 6 వేల నుంచి ప్రస్తుతం రోజుకు 90వేల మందికి దర్శన భాగ్యం కల్పిస్తుంది టీటీడీ. కానీ కాలినడకన వెళ్లే భక్తులకు ఇచ్చే దివ్య దర్శనం టికెట్లను మాత్రం మళ్లీ పునరుద్ధరించలేదు. నిత్యం వేలాది భక్తులు నడక మార్గంలో తిరుమల కొండకు చేరుకుంటారు. దాదాపు 3వేల మెట్లను ఎక్కి శ్రీవారి దర్శనానికి వెళ్తారు. వారి డిమాండ్ మేరక మళ్లీ దివ్య దర్శనం టికెట్లను ఇవ్వబోతోంది.

టీటీడీ గతంలో శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్లే భక్తులకి ఆరు వేల టిక్కెట్లు, అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తులకు మరో 14 వేల టిక్కెట్లను కేటాయిస్తూ వచ్చేది. కాలినడకన వెళ్లే భక్తుల సౌకర్యార్థం మళ్లీ అదే విధానాన్ని అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకొని అలసిపోతుంటారు భక్తులు. వారికి టైమ్ స్లాట్ ప్రకారం ఉచిత దివ్య దర్శన టోకెన్లు అందించడం ద్వారా శ్రీవారి దర్శనం సులభతరం చేయనుంది టీటీడీ. ఇందుకు తగట్లు ఏర్పాట్లు చేయాలనీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఏప్రిల్‌ 15 నుంచి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300/ దర్శన టికెట్లు తగ్గించనున్నామన్నారు. ఈ మూడు నెలల పాటు వీఐపీలు సిఫారసు లేఖలను తగ్గించాలని కోరడమైనది అన్నారు. తద్వారా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్‌ పెయింట్‌ వేస్తామన్నారు.

అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతామన్నారు. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తామని.. ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకుంటామన్నారు. టీటీడీ విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూస్తామన్నారు. శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తామన్నారు.

కాగా, మార్చి 30న 60,699 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 23,096 మంది తలనీలాలను సమర్పించారు. భక్తుల కానుకల రూపంలో శ్రీవారి హుండీకి 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh