Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు
దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసి కస్టడీకి తీసుకోగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను విచారణ చేసి సంచలనం సృష్టించిన ఈ కేసులో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న నితీష్ రాణా తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. 2015 నుంచి ఈడీకి స్పెషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తోన్న నితీష్ రాణా ఇలా రాజీనామా చేయటంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు నితీష్ రాణా వెల్లడించారు. కానీ దీని వెనక బలమైన కారణమే ఉండి ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తోన్నాయి. ఆయన రాజీనామాకు రాజకీయ ఒత్తిడే ప్రధాన కారణమని ఢిల్లీ గల్లీల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. సీబీఐ జైల్లో ఉన్న సిసోడియాపై ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. మనీష్ సిసోడియాతో పాటు మరో ఏడుగురిని నిందితులుగా చేర్చింది సీబీఐ. కొద్ది రోజుల క్రితం సిసోడియాను ప్రాసిక్యూటు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించారని అభియోగాలు నమోదు చేసింది. సీబీఐ తాజాగా నమోదు చేసిన కేసులో ఢిల్లీ ప్రభుత్వ మాజీ విజిలెన్స్ సెక్రటరీ సుకేష్ కుమార్ జైన్, సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ రాకేష్ కుమార్ సిన్హా, అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు, జాయింట్ డైరెక్టర్ పేర్లను కూడా చేర్చింది సీబీఐ. కాగా గురువారం రోజు ఈడీ విచారణ కు హాజరు కావాల్సి ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య కారణాల రీత్యా రాలేనని ఈడీకి లేఖ రాసింది.
ఇదిలావుంటే కవిత తరఫు న్యాయవాది సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వచ్చి పలు పత్రాలు ఇచ్చాడు. గతంలో కవితను ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా విచారించారని అన్నారు. సెల్ ఫోన్ బలవంతంగా తీసుకున్నారని, మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 15 కింద మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలను ఇంటికొచ్చి విచారించాల్సి ఉందన్నారు. విచారణను సాయంత్రం ఆరు గంటలలోపు పూర్తి చేయాలన్నారు. అయితే ఈడీ నిబంధనలు ఉల్లంఘించి ఎమ్మెల్సీ కవితను విచారణ చేపట్టారని న్యాయవాది సోమ భరత్ పేర్కొన్నారు.