TTD :టీటీడీ కి భారీ జరిమానా
తిరుమల తిరుపతి దేవస్థానాల కి కేంద్రం భారీ జరిమానా విధించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోని కారణంగా కేంద్ర హోం శాఖ రూ.3 కోట్ల జరిమా నా విధించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లైసెన్సు రెన్యువల్ చేసుకోని కారణంగా శ్రీవారికి విదేశీ భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ రూ.30కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాకుండా ఎస్బీఐ వద్ద మూలుగుతోంది. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో మారకానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంగీకరించలేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన హుండీలో వేసే నగదు లేదా ఖరీదైన లోహాలు, ఇతర వస్తువులకు భక్తులు ఎలాంటి లెక్కలూ చెప్పాల్సిన పనిలేదు. తరచూ భారీ మొత్తాల్లో అజ్ఞాత భక్తులు నగదు వేస్తుంటారు. అదే సమయంలో విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న భక్తులు సైతం తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. వాటిలో ఆయా దేశాల కరెన్సీ కూడా ఉంటుంది. గతంలో ఆ విదేశీ నగదును ఆర్బీఐ ద్వారా టీటీడీ మన కరెన్సీలోకి మార్చుకునేది. 2018 తర్వాత అలా మారకానికి ఆర్బీఐ అంగీకరించడం లేదు. దానికి తోడు విదేశీ కరెన్సీని ఎస్బీఐ టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేయడానికీ ఒప్పుకోవడం లేదు. ఫలితంగా 2018 నుంచీ ఇప్పటి వరకూ సుమారు రూ.30 కోట్ల మేరకు విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో జమ కాకుండా ఎస్బీఐ వద్ద మూలుగుతోంది.
విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించడానికి టీటీడీ కేంద్ర హోం శాఖ నుంచి ఎఫ్సీఆర్ఏ చట్టం కింద లైసెన్సు పొందింది. దానివల్ల 2018 వరకూ విదేశీ కరెన్సీ మారకానికి ఆర్బీఐ అనుమతించేది. ఎస్బీఐ కూడా విదేశీ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేసేది. 2018లో లైసెన్సు గడువు ముగిసింది. దాని రెన్యువల్‌పై టీటీడీ దృష్టి సారించలేదు. ఈ లేఖలను అందుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీకి 2019 సంవత్సరానికి రూ. 1.014 కోట్లు జరిమానా విధించారు. ఎఫ్సీఆర్ఏ చట్టానికి 2020లో చేసిన సవరణల ప్రకారం విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు వినియోగించుకోకూడదు. కానీ టీటీడీ వినియోగించుకోవడంపై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ ఆలస్యంగా అందజేసిన ఆదాయ వివరాలను కూడా సక్రమ ఫార్మాట్లో ఇవ్వలేదని తాజాగా మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో జరిమానా మొత్తం రూ.4.33 కోట్లకు చేరుకుంది.
శ్రీవారి హుండీ ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీలే టీటీడీకి ప్రధాన ఆదాయవనరులుగా మారాయి. ఇటీవల టీటీడీ ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెటే ఇందుకు నిదర్శనం. రూ.4,411.68 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీటీడీ రూ.2,581 కోట్లు అంటే సగం ఆదాయం హుండీ, డిపాజిట్ల ద్వారానే వస్తుందని పేర్కొంది. కొవిడ్ ముందువరకూ టీటీడీకి హుండీ ద్వారా ఏడాదికి రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్లు వచ్చేవి. ఇందులో భాగంగానే 2022-23 వార్షిక బడ్జెట్లోనూ టీటీడీ రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొంది. అయితే ఊహించని విధంగా గడిచిన ఏడాదిలో రూ.1,613 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయం కొవిడ్ అనంతరం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పెరిగింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జనవరి 2న రూ.7.68 కోట్లు లభించాయి. ఈ క్రమంలోనే రానున్న ఏడాదికి రూ.1,591 కోట్ల హుండీ ఆదాయం సమకూరుతుందని టీటీడీ భావిస్తోంది. మరోవైపు వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.668.51 కోట్లు ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. కొవిడ్ అనంతరం పెరిగిన వడ్డీ ధరలతో ఏకంగా రూ.813 కోట్లు లభించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.990 కోట్ల వడ్డీ వస్తుందని టీటీడీ అంచనా వేసింది. మరోవైపు ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.365 కోట్లు వస్తుందని గత బడ్జెట్లో అంచనా వేయగా, ఏకంగా రూ.500 కోట్లు లభించాయి.
అలాగే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేల టోకెన్లు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని వెల్లడించింది. ఆ తరువాత భక్తుల సూచనలు,సలహాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తామని టీటీడీ ప్రకటించింది.