Amit Shah: అదానీ వివాదంపై తొలిసారి స్పందించిన అమిత్ షా
ఇటీవల అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర ప్రభావమే చూపించింది. కొన్ని రోజులుగా ఇండియన్ స్టాక్ మార్కెట్ వర్గాల్లో అదానీ గ్రూప్ కంపెనీల భవితవ్యంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి అదానీ కంపెనీల షేర్లు ఎటువైపు పరుగు తీస్తాయో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం దేశ రాజకీయాల్లో హిట్ ను పెంచింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అదానీ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎట్టకేలకు పెదవి విప్పారు. అదానీ గ్రూప్ వ్యవహారంలోబీజేపీ దాచడానికి ఏమీ లేదని, భయపడాల్సిన పని లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో ఉందని, న్యాయ విచారణలో ఉన్న అంశంపై కేంద్ర మంత్రిగా స్పందించడం సరికాదని చెప్పారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, రుజువులు ఉన్నవారు ఈ కమిటీకి సమర్పించాలని ఆయన తెలిపారు
తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదన్నారు. న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలన్నారు. నిరాధారమైన ఆరోపణలను చేయకూడదని అవి ఎంతో కాలం నిలబడవని చెప్పారు. అదానీ వివాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు సెబీ (Securities and Exchange Board of India) అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. ఈ దర్యాప్తును కొనసాగించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఒకేసారి రెండు దర్యాప్తులు జరుగుతున్నాయన్నారు.
అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆరుగురు నిపుణులతో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, నందన్ నీలేకని, జస్టిస్ జే పీ దేవధర్, సోమశేఖర్ సుందరేశన్, ఓం ప్రకాశ్ భట్, కేవీ కామత్ ఉన్నారు.
అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ తదితర అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంపద పెద్ద ఎత్తున ఆవిరి అయిపోయింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, తదితర విపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి.