Rahul Gandhi: ప్రధాని మోదీ కళ్లల్లో భయాన్ని నేను చూశాను
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడరు . ఈ సందర్భంగా పరువు నష్టం కేసు, లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై స్పందించారు. అదానీ వ్యవహారంపై నా ప్రసంగాన్ని చూసి మోదీ ఆ రోజు భయపడ్డారు. ఆయన కళ్లల్లో భయాన్ని నేను చూశాను. నేను లోక్‌సభలో కూడా మరోసారి ప్రసంగిస్తే ఇంకెన్ని నిజాలు బయట పడతాయేమో అని భయపడ్డారు. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ తాను చేయబోయే ప్రసంగానికి భయపడ్డారని, అందుకే తనపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ రోజు (పార్లమెంట్లో రాహుల్ ప్రసంగించిన రోజు) మోదీ కళ్లలో భయం చూశానని ఆయన అన్నారు. అదానీ వ్యవహారంపై తాను ప్రశ్నలు వేసినందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని రాహుల్ ధ్వజమెత్తారు. తాను ఎవరికీ భయపడబోనని, ప్రశ్నించడం ఆపబోనని తేల్చి చెప్పారు. తాను వాస్తవాలనే మాట్లాడుతానని
తనను జైల్లో పెట్టినా ప్రధాని మోదీకి ప్రశ్నలు వేస్తూనే ఉంటానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు. ఈ దేశం తనకు ప్రేమ, ఆప్యాయత, గౌరవం అన్నీ ఇచ్చిందని రాహుల్ చెప్పారు. తాను ఎవరికీ భయపడబోనని, ప్రశ్నించడం ఆపనని, నిజాలే మాట్లాడుతానని స్పష్టం చేశారు. అనర్హతల లాంటివి తనను ఏమీ చేయలేవన్నారు. తన పేరు గాంధీ అని, క్షమాపణలు చెప్పే కుటుంబం కాదని రాహుల్ అన్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రతిపక్షాలకు రాజ్యాంగ వ్యవస్థల నుంచి మద్దతు లేదని, కేవలం ప్రజల మద్దతుతోనే విపక్షాలు పోరాటం చేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఓబీసీ అని, దేశ వ్యతిరేకి అని బీజేపీ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని రాహుల్ విమర్శించారు. అనర్హత విషయంలో తనకు అండగా నిలిచిన విపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక, తన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన తర్వాత ట్విట్టర్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ తాను భారతదేశ స్వరం కోసం పోరాడుతున్నానని తెలిపారు. ఇందుకోసం ఎంత వరకైనా వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌ను సూరత్‌లోని కోర్టు గురువారం(జనవరి 23) దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.
రెండేళ్ల జైలు శిక్షను కూడా విధించింది. అయితే కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. అయితే సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్లో రాహుల్‌పై లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇక, ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వయానాడ్ నుంచి విజయం సాధించారు.
ఇదిలా ఉంటే ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన వెంటనే కాంగ్రెస్ నాయకత్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, తారిఖ్ అన్వర్, సీనియర్ నేతలు పి చిదంబరం, ఆనంద్ శర్మ, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సల్మాన్ సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ రాహుల్‌తోనే మేము అంటు కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు పర్వం దేశవ్యాప్తంగా ‘జన్-ఆందోళన్’ పేరుతో నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది.