ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అక్కడే సజీవ దహనం అయ్యాడు. యూఎస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల, సత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు శైలేష్(21) బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అక్కడ న్యూజెర్సీలో తన స్నేహితులతో ఉంటూ కాలేజీకి వెళ్తూ ఉండేవాడు.
అయితే ఈ క్రమంలో శనివారం ఎప్పటిలాగే తన స్నేహితులతో కారులో యూనివర్సిటీకి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. శైలేష్ ప్రయాణిస్తున్న కారు న్యూజెర్సీలోని సెల్టన్ సర్కిల్ వద్దకు రాగానే టర్న్ తీసుకునేందుకు యత్నించారు. ఇంతలో ఆ కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో శైలేష్ ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్‌ను పేలిపోయింది. మంటలు వ్యాపించడంతో శైలేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే శైలేష్ తండ్రి సత్యం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట గల్ఫ్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చారు. తల్లి గృహిణి కాగా, అతడికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. శైలేష్ మరణ వార్త తెలుసుకున్న అమెరికాలోని తెలుగు అసోసియేషన్ సభ్యులు, అతడి స్నేహితులతో మాట్లాడారు. ప్రమాదం గురించి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక అధికారులతో మాట్లాడేందుకు తానా సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం శైలేష్ మృతదేహాన్ని మెడికల్ ఎగ్జామిన్ కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అతడి మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు స్థానిక తెలుగువారు. ఈ విషయం తెలుసుకున్నశైలేష్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమారుడు తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపించారు. అతని స్వగ్రామం బడాభీమ్‌గల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.శైలేష్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని బంధువులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కోరారు.