John Hastings: ఒక్క ఓవర్‌లో 18 బంతులు.. ఆసీస్ బౌలర్ హేస్టింగ్స్ చెత్త రికార్డు!

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్‌లో ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ అరుదైన చెత్త రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అతను 18 బంతులు వేశాడు. టీ20 చరిత్రలో ఇదే అత్యధిక బంతులు వేసిన ఓవర్‌గా నిలిచింది. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ బౌలర్ రోషన్ ప్రైమస్ పేరిట ఉండేది, అతను 13 బంతులు వేసాడు. కానీ ఇప్పుడు హేస్టింగ్స్ అతని రికార్డును దాటి సరికొత్త చెత్త రికార్డు నమోదు చేశాడు.

పాకిస్తాన్ ఛేదనలో పటిష్టంగా..
74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో పాకిస్తాన్ జట్టు 55/0తో పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో, ఆసీస్ కెప్టెన్ బ్రెట్ లీ జాన్ హేస్టింగ్స్‌కు బౌలింగ్ బాధ్యతలు అప్పగించాడు. కానీ 8వ ఓవర్‌లో హేస్టింగ్స్ 12 వైడ్లు, ఒక నోబాల్ వేయడంతో మొత్తం ఓవర్‌లో 18 బంతులు వేసి 20 పరుగులు ఇచ్చాడు. కేవలం 5 లీగల్ బంతులు మాత్రమే వేసిన అతని ఓవర్‌ ఆసీస్ గెలిచే అవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది.

హేస్టింగ్స్ గత క్రికెట్ ప్రస్థానం
జాన్ హేస్టింగ్స్ ఆసీస్ తరఫున 1 టెస్ట్, 29 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవజ్ఞుడు. ఐపీఎల్‌లోనూ అతను 3 మ్యాచ్‌లు ఆడాడు. అయినా ఈ ప్రదర్శన ఆశ్చర్యకరంగా ఉంది.

10 వికెట్ల తేడాతో పాక్ ఘనవిజయం
ఆస్ట్రేలియాకు 74 పరుగులకే ఆలౌట్ చేసిన పాకిస్తాన్, ఆ లక్ష్యాన్ని 7.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది. షర్జీల్ ఖాన్ 32 పరుగులు, సోహైబ్ మక్సూద్ 28 పరుగులతో మట్టికరిపించారు. ఆసీస్ తరఫున బెన్ డంక్ (26) మాత్రమే ఏమాత్రం పోరాడాడు.

ఫైనల్‌కు నేరుగా పాకిస్తాన్
భారత్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్ జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత పొందింది. లీగ్ దశలోనే అగ్రస్థానంలో నిలిచిన పాక్ టీం, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడంతో అదనపు పాయింట్లు కూడగట్టుకుంది. దీంతో ఫైనల్‌కి నేరుగా వెళ్లే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

Leave a Reply