Rishabh Pant: టీమిండియాకు భారీ షాక్‌.. గాయం కారణంగా సిరీస్‌కి దూరమైన రిషబ్‌ పంత్!

టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలింది. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్‌ పంత్ గాయపడ్డాడు. క్రిస్‌ వోక్స్‌ వేసిన బంతి అతని కుడి కాలి బొటనవేలికి బలంగా తగిలింది. వెంటనే స్కాన్‌ చేయగా ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. గాయం కారణంగా పంత్‌ 37 పరుగుల వద్ద రిటైర్‌ అవ్వగా, అతని స్థానంలో రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు.

అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు పంత్‌కి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో పంత్‌ దాదాపుగా మిగిలిన సిరీస్‌కి దూరమైనట్లే అని క్రీడావర్గాలు చెబుతున్నాయి.

పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌కి వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఐదో టెస్ట్‌కు ఇషాన్‌ కిషన్‌ స్టాండ్‌బైగా ఉండవచ్చు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఎడమచేతివాటం బ్యాటర్‌ ఇషాన్‌ వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపే అవకాశముంది.

ఇక ఆల్‌రౌండర్‌ నితేష్‌ కుమార్‌ రెడ్డి మోకాలి గాయం కారణంగా ఇప్పటికే సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ఫాస్ట్‌ బౌలర్లు ఆకాష్‌ దీప్‌ (గజ్జ), అర్షదీప్‌ సింగ్‌ (బొటనవేలు గాయం) కారణంగా నాల్గవ టెస్ట్‌కి అందుబాటులో లేరు. దీంతో భారత్‌ ప్రస్తుతం గాయాల సంక్షోభంతో సతమతమవుతోంది.

Leave a Reply