Tamim Iqbal: మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుతో కుప్పకూలిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్..

బంగ్లాదేశ్ క్రికెట్‌లో షాక్ కలిగించే సంఘటన చోటుచేసుకుంది. దేశానికి అగ్రశ్రేణి ఓపెనర్‌గా, మాజీ కెప్టెన్‌గా నిలిచిన తమీమ్ ఇక్బాల్ సోమవారం ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగానే అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆటలో నిమగ్నమైన సమయంలోనే ఆయన అసహజంగా ప్రవర్తించడం గమనించిన సహచర ఆటగాళ్లు, ఫిజియోథెరపిస్టులు అతని వద్దకు పరుగెత్తారు. కానీ కొద్ది క్షణాల్లోనే ఆయన్ను గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోతూ చూడగానే అందరూ షాక్‌కు గురయ్యారు.

అప్పటివరకు సాధారణంగా ఉన్న తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురికావడం చూసిన తోటి ఆటగాళ్లు, అంపైర్లు వెంటనే మెడికల్ టీమ్‌ను పిలిచారు. స్టేడియంలో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత, పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ECG, ఇతర కీలక టెస్టులు నిర్వహించగా, గుండె సంబంధిత సమస్య తీవ్రమైందని నిర్ధారించారు. ప్రస్తుతానికి తమీమ్‌ పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ మెడికల్ అధికారి దేబాశిస్ చౌదరి మాట్లాడుతూ, తమీమ్ ఇక్బాల్‌కు ఇది మూడోసారి గుండెపోటు వచ్చిందని వెల్లడించారు. గతంలోనూ రెండు సార్లు గుండె సంబంధిత సమస్యలు వచ్చాయని, కానీ ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా మారిందన్నారు. ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో అతన్ని ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు ప్రస్తుత ఆసుపత్రిలోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరుగా నిలిచారు. 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడిన తమీమ్, అన్ని ఫార్మాట్లలో కలిపి 15,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా, క్రమశిక్షణ, స్థిరతతో కొనసాగుతున్న ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నారు.

తమీమ్ ఇక్బాల్‌ అనారోగ్యానికి గురికావడంతో బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అభిమానులు, తోటి క్రికెటర్లు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో తమ ప్రార్థనలు తెలియజేస్తున్నారు. ఈ సంఘటన అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమీమ్ ఆరోగ్య పరిస్థితిపై తదుపరి అప్‌డేట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

తమీమ్ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలో సందడి చేయాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Leave a Reply