Fire Accident: సన్‌రైజర్స్ బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు!

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత పార్క్ హయత్ హోటల్‌లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నవారిలో కలవరం మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, హోటల్ మొదటి ఫ్లోర్‌లో మంటలు మొదలయ్యాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో హోటల్‌లో ఉన్న టూరిస్టులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.

ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు.. మంటలు తీవ్రమైన దశకు చేరకముందే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటన ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారడానికి కారణం.. అదే హోటల్‌లో ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ సన్‌రైజర్స్ టీం బస చేస్తుండటమే. శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత, ఎస్ఆర్‌హెచ్ టీం ముంబైలో జరగబోయే తదుపరి మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోనే మిగిలి ఉంది.

అయితే మంటలు మొదలైన వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై, ప్లేయర్లను, వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా మరో ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

ఈ సంఘటనతో ఎస్ఆర్‌హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఎవరికి ఎటువంటి ప్రాణహానీ జరగలేదని స్పష్టం చేశారు.

Leave a Reply