కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జెర్సీకి రికార్డు ధర.. రూ.5.41 లక్షలు!

ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జెర్సీ, ఆటగాళ్లందరిలో అత్యధిక ధరకు వేలంలో అమ్ముడుపోయింది. ఈ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు విక్రయమైంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ భారత క్రికెట్‌కి మలుపుతిప్పే ఘట్టమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆర్.అశ్విన్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా జట్టు ఎలా ఆడుతుందో అన్న ఆందోళనల మధ్య, గిల్ సారధ్యంలోని యువ జట్టు అద్భుత ప్రదర్శనతో మెప్పించింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

కొన్ని మ్యాచ్‌లలో ఓటమి ఎదురైనా, చివరి టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. గాయాలకూ లొంగకుండా ఆడిన గిల్, పంత్, రాహుల్, సిరాజ్ వంటి ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించారు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అద్భుత నాయకత్వాన్ని చూపించాడు.

ఈ విజయంతో జట్టు క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా జరిగిన ప్రత్యేక వేలంలో, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆటగాళ్లు ధరించిన జెర్సీలు, టోపీలు అమ్మకానికి వచ్చాయి. వీటిలో గిల్ జెర్సీ అత్యధికమైన రూ.5.41 లక్షలకు విక్రయమైంది. 2-2తో ముగిసిన సిరీస్‌లో గిల్ ఒక డబుల్ సెంచరీ, మూడు సెంచరీలతో మొత్తం 754 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.

గిల్ తర్వాత, జడేజా మరియు బుమ్రా జెర్సీలు చెరో రూ.4.94 లక్షలకు అమ్ముడయ్యాయి. రిషబ్ పంత్ జెర్సీ రూ.4 లక్షలు పలికింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్ జెర్సీ రూ.4.47 లక్షలు, బెన్ స్టోక్స్ జెర్సీ రూ.4 లక్షలకు విక్రయమయ్యాయి. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌కి అందజేయనున్నారు.

Leave a Reply