RCB vs Punjab: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన RCB.. చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ నిర్దేశించిన 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 9.5 ఓవర్లలోనే చేజ్ చేసి, 8 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది.

మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో పంజాబ్‌ను కట్టి పడేశారు. సుయాష్ శర్మ, హేజిల్‌వుడ్ తలా మూడు వికెట్లు తీయగా, యశ్ దయాల్ రెండు వికెట్లు తీసి మెరిశారు. పంజాబ్ తరఫున ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా 30 పరుగుల మార్క్‌ను తాకలేకపోయాడు. స్టోయినిస్ (26), ప్రభ్‌సిమ్రన్ (18), ఒమర్‌జాయ్ (18) మాత్రమే కొంత మేర పరుగులు సాధించారు. 14.1 ఓవర్లలో పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ అయింది.

102 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టులో ఓపెనర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కోహ్లీ (12) త్వరగా ఔటైనప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్ త్వరగా మ్యాచ్‌ను ముగించారు. కెప్టెన్ పాటిదార్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ గెలుపుతో ఆర్సీబీ తన నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. 2009, 2011, 2016 ఫైనల్స్‌లో ఓటమి చెందిన ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలుస్తుందా అనే ఆసక్తి మ‌రింత పెరిగింది. ఇప్పటివరకు టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీకి అభిమానులు “ఈ సాలా కప్‌ నమ్‌దే” అనే నినాదంతో మద్దతు పలుకుతున్నారు.

ఫైనల్ జూన్ 3న జరగనుండగా, మరొక ఫైనలిస్టును నిర్ణయించేందుకు గుజరాత్ టైటాన్స్ – ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-2 జరుగనుంది. ఆ మ్యాచ్ విజేతతో ఫైనల్‌లో ఆర్సీబీ తలపడనుంది.

Leave a Reply