Ravindra Jadeja: ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు.. రవీంద్ర జడేజా కి మాత్రమే ఇది సాధ్యం..!

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. 3,000 పరుగులు చేయడంతో పాటు 100కి పైగా వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించి, తన పేరు ఐపీఎల్ చరిత్రలో చెరగని ముద్రవేశాడు. తన 243వ మ్యాచ్‌లో ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం.

34 ఏళ్ల జడేజా ఐపీఎల్‌లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రాజస్థాన్ రాయల్స్ (2008-09), కోచి టస్కర్స్ కేరళ (2011), చెన్నై సూపర్ కింగ్స్ (2012-15, 2018-ప్రస్తుతం), గుజరాత్ లయన్స్ (2016-17) జట్ల తరఫున ఆడాడు. ఇప్పటివరకు 243 మ్యాచ్‌ల్లో 3,001 పరుగులు చేసి, 160 వికెట్లు తీసుకున్నాడు. బౌలింగ్ పరంగా చూస్తే 30.76 సగటుతో, 7.64 ఎకానమీ రేటుతో 160 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై తరఫున 133 వికెట్లు తీసి, జట్టు వికెట్ చార్టులో డ్వేన్ బ్రావో (140 వికెట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 3,000 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన ఆటగాడు జడేజా ఒక్కడు మాత్రమే. ఇంకా ఎవ్వరూ ఈ మైలురాయిని చేరుకోలేదు. అయితే, ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉంది. అతను 254 మ్యాచ్‌ల్లో 8,094 పరుగులు సాధించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో నిన్నటి మ్యాచ్ చెన్నై అభిమానులకు నిరాశనే మిగిల్చింది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు.. సీఎస్కేపై అదిరిపోయే విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ తరఫున రజత్ పాటీదార్ (51), ఫిల్ సాల్ట్ (32) మెరిశారు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 146 పరుగులకే కుప్పకూలింది. రచిన్ రవీంద్ర (41) మాత్రమే గొప్పగా ఆడాడు. చివర్లో ధోనీ (30*) రెండు సిక్స్‌లు బాదుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.

ఆఖరికి చెన్నై 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రవీంద్ర జడేజా అరుదైన రికార్డును నమోదు చేసినా, జట్టు ఓటమి పాలవ్వడం అభిమానులను నిరాశపరిచింది.

Leave a Reply